ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు మంగళవారం దేశవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. వేతన సంబంధ అంశాలుసహా పలు సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) గొడుకు కింద పలు యూనియన్ల బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడమే దీనికి కారణం. కాగా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కొటక్ మహీంద్రా వంటి బ్యాంకులు పనిచేసినా... చెక్ క్లియరెన్సుల విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంగళవారం సమ్మె ప్రభావం గురించి ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబీసహా పలు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు వివరించాయి. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో 75 శాతం వాటా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులది కావడం గమనార్హం.