కళ్ల ముందే దోపిడీ.. కళ్లెం వేసే వాడేడీ ! | - | Sakshi
Sakshi News home page

కళ్ల ముందే దోపిడీ.. కళ్లెం వేసే వాడేడీ !

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

జాతీయ రహదారి కోసం కొండను చదును చేసిన కాంట్రాక్టర్లు

చిధ్రమైన పెన్నానది

జమ్మలమడుగు: కూటమి ప్రభుత్వంలో జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా సాగుతున్న భూదోపిడీ, ఇసుక దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కొండలు, గుట్టలే కాకుండా నదులలో సైతం రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక, ఎర్రమట్టి, గ్రావెల్‌ను ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ముందే వందలాది టిప్పర్లు పగలు, రాత్రి హడావుడి చేస్తున్నా.. అక్రమ రవాణాను కట్టడి చేయాల్సిన మైనింగ్‌, రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం కూడా మానేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులు పట్టపగలే యథేచ్ఛగా టిప్పర్లలో గ్రావెల్‌ తరలిస్తూ కాసుల వేట సాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు వంద ఎకరాల వరకు కొండ ప్రాంతాలను అడ్డగోలుగా తవ్వేసి కొండలను చదును చేసేశారు.

జాతీయ రహదారి పేరిట కొండనే తొలిచేశారు

ఎటువంటి అనుమతులు లేకుండా ఏకంగా 22 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం జమ్మలమడుగు నుంచి నొస్సం వరకు నిర్మించిన రోడ్డు కోసం కొండను తవ్వేశారు. ముద్దనూరు రహదారి సమీపంలో ఉన్న కొండల ప్రాంతాలను పెద్ద పెద్ద పొక్లెయిన్లు పెట్టి గ్రావెల్‌, మట్టిని తమ టిప్పర్‌ల ద్వారా రాత్రి పగలు అనే తేడా లేకుండా తరలించారు. కనీసం ఇదేమని ప్రశ్నించిన రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులు స్పందించిన పాపాన పోలేదు. ఎవ్వరైనా ప్రశ్నిస్తే అది తమకు సంబంధంలేదంటూ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉచితం పేరిట పెన్నానది స్వాహా

మరోవైపు ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పడంతో అక్రమార్కులు పెన్నానదిని తోడుతున్నారు. పెన్నా బెల్టు ప్రాంతం నుంచి కూటమి నాయకులే స్వయంగా పెన్నానదిలో డోజర్‌లతో ఇసుకను తొడుకుంటూ రోజుకు లక్షల రూపాయలకు పైగా కమీషన్‌ల రూపంలో డబ్బు రాబుట్టుకుంటున్నారు. పట్టపగలే పెన్నానది నుంచి 20 నుంచి 50 ట్రాక్టర్‌ల వరకు ఇసుకను తరలించుకుని పోతున్నారు. అధికారులు మాత్రం ఉచిత ఇసుక మేము ఎలా పట్టుకోవాలని, తాము కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందంటున్నారు. టిప్పర్‌ల ద్వారా ఇసుకను ఇతర జిల్లాలకు తరలించుకునిపోతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో కూటమి నాయకులు అడిందే ఆట పాడిందే పాటగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు మేలుకోకపోతే భవిష్యత్తులో భూగర్భజలాలు అడుగంటిపోయి, తాగునీటి ఎద్దడి వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.

జమ్మలమడుగులో కొండలు, గుట్టలు, నదులను కొల్లగొడుతున్న అక్రమార్కులు

జాతీయ రహదారి పేరిట 22 కిలోమీటర్ల మేర సాగుతున్న అక్రమ తవ్వకాలు

ఉచితం పేరిట పెన్నానదిని తోడేస్తున్న పచ్చనేతలు

రోజుకు రూ.లక్షల్లో కమీషన్ల దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement