కడప సెవెన్‌రోడ్స్ : తమ సమస్యలు పరిష్కరించే వరకు దశల వారీ ఆందోళనలు నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కార్యదర్శి కృష్ణకుమార్, కోశాధికారి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రొనాల్డ్ తెలిపారు. రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం కలెక్టర్‌కు ఉద్యమ కార్యచరణ నోటీసు అందజేశారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి మధ్యంతరం భృతి ప్రకటించాలని కోరారు. ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలని, సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లుపై రెవెన్యూశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఉద్యోగ సంఘ నాయకులపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఆర్టీసీలో ఖాళీలు భర్తీ చేయాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 214 కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి శ్రీనివాసులు, హెడ్మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ సుబ్బారెడ్డి, మహిళా విభాగం చైర్ పర్సన్ ఖాజాబీ, శారద, మేరి, అనూరాధ, ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బోసుబాబు, ఏఐటీయూసీ నాయకుడు ఎల్.నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కడపలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రదర్శన


