కడప కార్పొరేషన్: కళాశాల అభివృద్ధి కోసమే కాలేజీకి ఉన్న భూమిని విక్రయించామని తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీ ఛైర్మెన్ ఎస్.ఖాదర్‌బాష అన్నారు. కడప బిల్టప్ సమీపంలోని తయ్యుబ్ కళాశాలలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన సొసైటీ 1989లో మొదలైందని, 2003 నుంచి తాను కాలేజీకి చైర్మన్‌గా ఉన్నానన్నారు. కాలేజీకి సంబంధించి రెండు సొసైటీలు ఉన్నాయని పత్రికల్లో వచ్చిందని, అది వాస్తవం కాదన్నారు. ఆ సొసైటీ తమదని వాదిస్తున్న షేక్ నసీర్ హుస్సేన్‌కు, కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని.. అతను కనీసం సభ్యుడు కూడా కాదన్నారు. సొసైటీకి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, 1999 నుంచి రికార్డులు పక్కాగా ఉన్నాయన్నారు. 1994లో కాలేజీలో అడ్మిషన్లకు అనుమతి వచ్చిందని, కాలేజీ కూడా బాగా నడిచేదన్నారు. ఎక్కువ మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లడం వల్ల నష్టాలు వచ్చాయన్నారు. ఈ క్రమంలో చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురంలో కాలేజీకి సంబంధించిన 25 ఎకరాల భూమిని విక్రయించాలని సొసైటీ సభ్యులందరం నిర్ణయించామన్నారు. ఈ మేరకు 2018లో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ నుండి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కాలేజ్ డెవెలప్‌మెంట్ కోసం భూమిని న్యాయపద్ధతిలో అమ్మామని చెప్పారు. భూమి విక్రయించే అంశాన్ని జనరల్ బాడీ సమావేశంలో పెట్టి 19 మంది సభ్యులు ఆమోదించి, తీర్మానించిన తర్వాతే విక్రయించామన్నారు. మొదట టింబర్ డిపో సుధీర్‌కు విక్రయించామని, ఆయన అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తిరిగి దానిని అమ్మకానికి పెట్టామన్నారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మి పద్మావతి కన్‌స్ట్రక్షన్స్ వారు దానిని కొనుగోలు చేశారని, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అందులో వాటాదారు మాత్రమేనన్నారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, ఎవరు డబ్బు ఇస్తే వారికి విక్రయించామన్నారు. అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో కాలేజీని అభివృద్ధి చేశామని, తరగతి గదులు, ప్రహరీ గోడ, స్పోర్ట్స్ రూమ్ వంటివి నిర్మించామన్నారు. పేద ముస్లిం విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలని నర్సింగ్ కాలేజీ, బీఈడీ కాలేజీల అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతి ఏడాది సొసైటీకి ఎన్నికలు జరుగుతున్నాయని, అందుకు సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాలను గ్రహించాలని, అనవసరమైన ఆరోపణలు చేయవద్దని తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీ ఛైర్మెన్ ఎస్.ఖాదర్‌బాష కోరారు. ఈ సమావేశంలో ఎస్‌ఎండీ ఆజమ్ తదితరులు పాల్గొన్నారు.
2003 నుంచి తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీకి చైర్మన్‌గా ఉన్నా
షేక్ నసీర్ హుస్సేన్‌కు, కాలేజీకి ఎలాంటి సంబఽంధం లేదు
ఎస్. ఖాదర్‌బాష


