కడప కార్పొరేషన్ : పదిహేనేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప దెబ్బ అంటే ఢిల్లీ అబ్బ అనేలా చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారందరినీ పరామర్శించేందుకు వై.ఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపడితే, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ దానిని అడ్డుకుని, సీబీఐ కేసులు పెట్టి వైఎస్ కుటుంబాన్ని బలహీన పర్చాలని కుట్ర చేసిందన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ లోక్ సభ (పార్లమెంట్) సభ్యత్వానికి రాజీనామా చేసి... రికార్డు మెజారిటీతో తాను గెలవడమే కాకుండా, తన తల్లి వై.ఎస్ విజయమ్మను రికార్డు మెజారిటీతో గెలిపించి కడప జిల్లా చరిత్రను దేశానికి చాటిన దమ్మున్నోడు వైఎస్ జగన్ అని కొనియాడారు. సోనియా గాంధీని, ఢిల్లీ సింహాసనాన్ని గడగడలాడించి లోక్ సభ సభ్యుడిగా వై.ఎస్ జగన్ 5,45,672 ఓట్లు రికార్డు మెజారిటీతో గెలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వైఎస్ విజయమ్మపై తన బాబాయ్ వివేకానంద రెడ్డిని పోటీ చేయించినా కాంగ్రెస్, టీడీపీలను ఓడించి పులివెందుల ఎమ్మెల్యేగా 81,373 ఓట్లతో తన తల్లి వై.ఎస్ విజయమ్మ ను గెలిపించుకుని కడప పౌరుషాన్ని చూపించారన్నారు.ఆ చారిత్రాత్మక ఘట్టానికి 13 మే 2026 నాటికి అంటే బుధవారానికి 15 ఏళ్లు పూర్తి కావడం సంతోషదాయకమన్నారు. వై.ఎస్ కుటుంబానికి చేసిన నమ్మకద్రోహానికి, నాడు వై.ఎస్ జగన్‌ను 16 నెలలు అన్యాయంగా, అక్రమ కేసులు పెట్టిన పాపానికి నేటికీ కాంగ్రెస్ కోలుకోలేని స్థితికి చేరి భారీ మూల్యం చెల్లించుకుందన్నారు. ఇది వై.ఎస్ జగన్ చరిస్మాకు,ధైర్య సాహసాలకు, నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మొదలు కూటమి నేతలంతా వై.ఎస్ జగన్ పేరు, నామస్మరణ లేకుండా ప్రసంగాలు చేయలేక ఉన్నారని, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో జగన్ పేరు లేకుండా కథనాలు ఉండటం లేదన్నారు. ఇది వై.ఎస్ జగన్ అంటే వారందరికీ ఉన్న భయానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు. సమావేశంలో వైయస్సార్‌సీపీ నాయకుడు ఆర్. శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
ఆర్.వెంకట సుబ్బారెడ్డి


