కడప ఎడ్యుకేషన్ : విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల పేర్లతో నూతన బ్రాంచ్‌లు ఎక్కువయ్యాయి. ఇందుకు హంగులూ, ఆర్భాటాలతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తూ ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థుల చేరికలో ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్నదో లేనిదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ నియంత్రణ కొరవడటంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. ఆమోదం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవే టు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అను మతి తీసుకోవాలి. మొదట ఓపెనింగ్ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ అనుమతి తీసుకోవాలి. సీబీఎస్‌ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. ఇలా అన్ని అనుమతులింటేనే పాఠశాలలను నిర్వహించాలి.
వీటిపై ఆరా తీయండి..
ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి రికగ్నైజేషన్ పొంది ఉండాలి. ఇది నిబంధన. అయితే చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి రికగ్నైజేషన్ తీసుకోవడం తప్పనిసరి. రికగ్నైజేషన్ పొందిన విద్యా సంస్థలలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యా సంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బ్రాంచ్‌ల పేరుతో పాఠశాలలు, కళాశాలలు నడుపుతూ ఎక్క డో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులు విచారణ చేసి విద్యా సంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకున్న తరువాతే పిల్లలను చేర్పించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
● తొలుత పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి.
● ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించాలి.
● మౌలిక వసతులతోపాటు బాత్‌రూములు, మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు తప్పనిసరి. విద్యార్థుల మానసిక, శారీకోల్లాసానికి ఉపకరించే క్రీడా ప్రాంగణం, అనుగుణంగా క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా ఆరా తీయాలి.
● అర్హత గల ఉపాధ్యాయులు బోధనలు చేస్తున్నారా లేదా పరిశీలించాలి.
● ప్రాఽథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాలలు అయితే సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి.
● సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణాశాఖ జారీ చేసిన సామర్థ్య పరీక్ష పత్రాన్ని పరిశీలించాలి. సుశిక్షితుడైన డ్రైవరు తప్పనిసరి.
● జీ–1 భవనాలు ఉంటే అగ్నిమాపక పరికరాలు, ఆ స్థాయి దాటితే మంటలు అర్పే పూర్థి స్థాయి వ్యవస్థ ఉండాలి. సంబంధిత విభాగం నుంచి అనుమతి ఉండాలి.
● ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. చైల్డ్ ఇన్‌ఫో ఆధారంగానే విద్యార్థుల ప్రగతి పత్రాలు, బదిలీ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్న వారిగా పేర్కొంటున్నారు. ఫలితంగా సమస్యలు ఏర్పడుతాయి.
తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త
ముందస్తు అడ్మిషన్లతో అప్రమత్తత అవసరం
ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోస పోకండి
పాఠశాలల గురించి తెలుసుకున్నాకే
చేర్పించాలి
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. అదే విధంగా విద్యా సంస్థ పక్కాగా రిజిస్ట్రేషన్‌తోపాటు ప్రభుత్వ రికగ్నైజేషన్ పొంది ఉండాలి. తల్లిదండ్రులు ప్రైవేటు సంస్థలను ఆకట్టుకునే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. అన్ని జాగ్రత్తలు పాటించి పిల్లలను చేర్పించాలి.
– షేక్ షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్‌కడపజిల్లా


