అట్లూరు మండల వాసి ఎన్‌వీహెచ్‌ కంపెనీలో మృతి | - | Sakshi
Sakshi News home page

అట్లూరు మండల వాసి ఎన్‌వీహెచ్‌ కంపెనీలో మృతి

May 13 2026 1:32 AM | Updated on May 13 2026 1:32 AM

అట్లూరు : అట్లూరు మండలం ముత్తుకూరు పంచాయతీ జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన సొద్దల రామాంజనేయులు(24) అనంతపురంలోని ఎన్‌వీహెచ్‌ కంపెనీలో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందాడు. అతను శుక్రవారం మిషనరీలో పడి మృత్యువాత పడ్డాడు. అయితే అతను కియా కంపెనీలో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందినట్లు సోమవారం వార్త వచ్చింది. అది కియా కంపెనీ కాదు.. కియాకు సప్లైర్‌ కంపెనీ అయిన ఎన్‌వీహెచ్‌ కంపెనీగా గమనించగలరు.

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

చింతకొమ్మదిన్నె : మండల పరిధి సీఎంఆర్‌ పల్లె సమీపంలోని అంగడి వీధిలో నివసించే రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి గోపాలక్రిష్ణ భార్య రేణుకాదేవి(54) సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు. ఆమె గత నెలలో కూడా రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుడి చేతికి గాయాలు కాగా చికిత్స పొందినట్లు వారు పేర్కొన్నారు. మృతురాలి భర్త గోపాలక్రిష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.

నియామకం

కడప అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానానికి గవర్నమెంట్‌ ప్లీడర్‌గా సీనియర్‌ న్యాయవాది ఎం.సురేష్‌ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రభుత్వం తరఫున సివిల్‌ కేసులను జిల్లా కోర్టులో వాదించనున్నారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌ జీపీగా ఆదినారాయణరావు వ్యవహరించారు.

అల్మాస్‌పేట ఘటనలో ముగ్గురి అరెస్ట్‌

కడప అర్బన్‌ : కడప నగరం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్మాస్‌పేట ఘటనలో ఒకవైపున నిందితులుగా వున్న వారిలో బాబుభాయ్‌, షబ్బీర్‌ హుసేన్‌, జాకీర్‌లను పోలీసు అధికారులు, సిబ్బంది మంగళవారం అరెస్ట్‌ చేశారు. వారిని కడపలోని కోర్టులో హాజరుపరిచారు.

ఈతకు వెళ్లి

ఇద్దరు చిన్నారుల మృతి

పుంగనూరు : వేసవి తీవ్రంగా ఉండటంతో చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని పట్రపల్లె తండాకు చెందిన గణేష్‌నాయక్‌ కుమారుడు వరుణ్‌నాయక్‌(14), మణి నాయక్‌ కుమారుడు నిలేష్‌నాయక్‌(8) కలసి బడిగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు మధ్యాహ్నం వెళ్లారు. ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లి ఇద్దరూ మునిగిపోయారు. సమీపంలో బాతులు మేపుతున్న యువకులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. అందరూ కలసి హుటాహుటిన వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. వారి మృతదేహాలకు కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement