కడప కార్పొరేషన్: కడప నగరం అల్మాస్‌పేటలో ఇటీవల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్‌బాబులతో కలిసి ఆయన ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు కడపలో ఏనాడూ జరగలేదన్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన మైనర్లు, అమాయకులు, సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి, వివిధ జైళ్లకు పంపించారన్నారు. మరో మారు విచారించి సంబంధం లేని వారిని విడుదల చేయాలన్నారు. అల్మాస్‌పేట నాలుగు రోడ్ల కూడలి కావడంతో అటు, ఇటు వెళ్లే వారంతా అక్కడకు చేరుకుని గుమికూడారని, వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఘటనతో సంబంధం ఉన్నవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, సంబంధం లేనివారు, అమాయకులు, మైనర్లపై బెయిలబుల్ సెక్షన్లు పెట్టి విడుదల చేయాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా కడప మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, అలాంటి కడపను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, తోటక్రిష్ణ, షఫీ, షఫీవుల్లా, శ్రీరంజన్‌రెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
ఘటనతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసుకోండి
ఎస్పీతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుపి. రవీంద్రనాథ్‌రెడ్డి,మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు


