ఈ–ఆఫీసు వినియోగం తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఈ–ఆఫీసు వినియోగం తప్పనిసరి

May 12 2026 5:30 AM | Updated on May 12 2026 5:30 AM

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు తప్పనిసరి అని కలెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సభా భవనంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ–ఆఫీసు ద్వారా ఫైళ్లు పంపాలని గత ఆరునెలలుగా ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని కార్యాలయాల్లో భౌతికంగానే ఫైళ్లు నడుపుతున్నారని తెలిపారు. ఇది క్రమశిక్షణా రాహిత్యమే కాకుండా చట్టవిరుద్ధమని తెలిపారు. ప్రతి అధికారి తన లాగిన్‌కు వచ్చిన ఫైళ్లను రెండు రోజుల్లో పరిష్కరించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు ఫైళ్ల పరిష్కారానికి 6–11 రోజుల సమయం తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్‌ఎస్‌లో రీఓపెన్‌ అయిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలో లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నిధి మీనా, డీఆర్వో మల్లికార్జునుడు, జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

● ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తొలగించిన వెంకటేశ్‌ అనే కార్మికుడిని విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనోహర్‌ కోరారు. కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ నిబంధనలు పాటించని ఈగల్‌ హంటర్‌ సెక్యూరిటీ సర్వీసు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు.

● తనభూమికి పాసు పుస్తకం మంజూరు చేయాలని కడపకు చెందిన వెంకట సుబ్బయ్య కోరారు.

● వేముల మండలానికి చెందిన చెంగల్‌రెడ్డి తనకు ప్రభుత్వ పెన్షన్‌ మంజూరు చేయాలని, కొండాపురం మండలానికి చెందిన కుమారి రేషన్‌కార్డు మంజూరు చేయాలని కోరారు.

● తన గ్రామ పొలం సర్వే నెంబరు 262/ఎలోని 19 సెంట్ల స్థలంలో తాను రేకుల ఇళ్లు, మరుగుదొడ్డి నిర్మించుకున్నానని కలసపాడుకు చెందిన నాగశేషయ్య తెలిపారు. ఆ స్థలం తాను శ్రీనివాసులు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నానన్నారు. కాగా ఆ స్థలంలో బంగారు ఉందని చెబుతూ కొందరు తనను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు.

కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement
 
Advertisement
Advertisement