చౌడేపల్లెలో కాలం తిరగబడింది.. వేసవిలోనూ దట్టంగా కురిసిన పొగమంచుచౌడేపల్లె:అసలే మే నెల.. భానుడి భగభగలకు జనం విలవిలలాడాల్సిన సమయం. కానీ చౌడేపల్లె పరిసరాల్లో కాలం ఒక్కసారిగా తిరగబడింది. ఎండల తీవ్రతతో సెమటలు పట్టాల్సిన వేళ, చలికాలంలా మంచు తెరలు అలుముకోవడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు.మంగళవారం ఉద యం 8 గంటలైనా దట్టమైన పొగమంచు వీడకపోవడంతో చౌడేపల్లె వాసులు ఆశ్చర్యపోయారు. అసలే ఎండలు మండే మే నెలలో ఈ మంచు ముచ్చట్లు ఏమిటబ్బా అంటూ కాఫీ షాపుల వద్ద చర్చలు సాగాయి. మంచు కారణంగా రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో కూడా వాహనాలకు లైట్లు వేసుకుని మంచు మబ్బుల్లో నెమ్మదిగా ప్రయాణిస్తున్న చిత్రాలు ‘సాక్షి’ కెమెరా కంటపడ్డాయి. ప్రకృతిలో వస్తున్న ఈ వింత మార్పులను చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. –ఫొటో: రసూల్, చౌడేపల్లి


