రాజంపేట టౌన్ : భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. పొద్దు పొడిచింది మొదలు పొద్దుపోయేదాకా ఎండలు మండిపోతున్నాయి. మనిషి ఎండ నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో వాహనాలను కాపాడుకునేందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వాహనాలు ఎండలో గంటల కొద్ది ఉండటం వల్ల ముఖ్యంగా పెట్రోల్ ఆవిరి అయిపోతుంది, అలాగే వాహనం రంగు వెలిసిపోతుందని మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వాహనాలకు ట్యాంకు నిండా పెట్రోల్ పట్టిస్తే ఒక్కోసారి వాహనం పేలి దగ్దం అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వేసవి కాలంలో వాహనాలపై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇంజనీరింగ్ నిపుణులు ఏమి చెబుతున్నారంటే..
● వాహనాలు ఎక్కువసేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్లలో పెట్టుకోవాలి.
● దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వాహనాల వేగానికి ఉష్ణోగ్రతల వేడికి ఇంజిన్ రెండింతలు ఎక్కువ వేడెక్కే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత
ఇంజిన్‌ను కాసేపు నీడలో నిలిపితే మంచిది. లేకుంటే ఒకొక్క మారు ఇంజిన్‌లో మంటలు చెలరేగే ప్రమాదం కూడా ఉంటుంది.
● అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లలో గాలి తగ్గుతూ ఉంటుంది. కనీసం వారానికి ఒకమారైనా వాహనాల్లో గాలిని తనిఖీ చేయించుకోవాలి
● వేసవి కాలంలో వాహనాలకు గాలి తగిన మోతాదులో మాత్రమే పట్టించాలి. ఎక్కువ మోతాదులో పట్టిస్తే టైర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది.
● పెట్రోల్‌ను పగలు కంటే సాయంత్రం వేళల్లో పట్టించడం మంచిది
పెద్ద వాహనాలకు ఇలా చేయాలి..
● కార్లు, లారీలు ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీళ్లను తరచూ తనిఖీ చేసుకోవాలి
● నీళ్లకంటే కూలెంట్ ఆయిల్ వాడటం మంచిది.
● వేడికి ఇంజిన్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా ఎప్పటిప్పుడు పరిశీలిస్తుండాలి.
● గ్యాస్ ద్వారా వాహనాలను నడిపేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు అలాంటి వారు గ్యాస్‌కిట్‌ను ఉపయోగించకుండా ఉండటం ఉత్తమం
● ఏసీ నిల్వవుండాలంటే అద్దాలకు క్లాత్ మ్యాట్స్ ఏర్పాటు చేసుకోవాలి
● వేసవి పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు కొత్త టైర్లను వాడితేనే మేలు లేదంటే దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పాత టైర్లలో గాలి తగ్గి పేలిపోయే ప్రమాదముంది.


