వేంపల్లె : వేంపల్లె మండలం నందిపల్లె గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌తోపాటు 15మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
సోమవారం ఉదయం వేంపల్లె పట్టణంలోని గౌరీ నగర్, సంఘం వీధి, కరణంవీధి తదితర ప్రాంతాల నుంచి నందిపల్లె గ్రామ పొలాల్లోకి వ్యవసాయ కూలీ పనికి ఆటోలో వెళ్లారు. మధ్యాహ్నం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆటో డ్రైవర్ వేరే వాహనాన్ని తప్పించబోయి మట్టి కుప్పను ఎక్కించాడు. అధిక లోడు ఉండడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 8మందికి తీవ్రంగా, మిగిలిన వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన డ్రైవర్ నిత్యానంద, వీరమ్మ, మహబూబ్ బీ, పద్మావతి, అమరావతి, అంజనమ్మ లక్ష్మీదేవిలను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. మిగిలిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
15మంది కూలీలకు తీవ్ర గాయాలు


