పులివెందుల రూరల్ : టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని టీడీపీ సీనియర్ నాయకులు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లెలో ఉన్న తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల ఇళ్లకు వెళ్లి వారిని కూడా ఆప్యాయంగా పలకరించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఎద్దేవా చేశారు. పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి గుర్తింపు లేదన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్థాయి వ్యక్తులను కలుస్తున్నారే తప్పా.. టీడీపీ సీనియర్ నాయకులను కలవడంలేదని అన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు (చంద్రబాబు) ఇక్కడ నుంచి 34మంది కార్యకర్తలను పిలిపించి మాతో మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ఆ సంతోషంగా ఎంతోకాలం నిలబడలేదని, అధికారం వచ్చిన తర్వాత మాకు గౌరవ మర్యాదలు, కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుందని భావించామన్నారు. కానీ రెండేళ్లవుతున్నా టీడీసీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను పిలిపించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. అధికారంలో ఉండేది ఐదేళ్లు కాబట్టి.. ఐదేళ్ల తర్వాత మా అవసరం వస్తుందని, దయచేసి మమ్ములను ఎన్నికలప్పుడు ఉపయోగపడే యంత్రాలుగా కాకుండా, మేం మనుషులమని, మీరు పిలిపించి మాట్లాడితే గౌరవం పెరుగుతుందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబునాయుడు ప్రతి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలను ముఖ్యమంత్రి హోదాలో కలుస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
టీడీపీ సీనియర్ నాయకులు వెంకట్రామిరెడ్డి


