గోపవరం : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం ప్రాంతంలో జరుగుతున్న భూకబ్జాలను వెంటనే ఆపాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణ కార్యదర్శి బాలు, రూరల్ కార్యదర్శి ఇమ్మానియేల్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి క్రయవిక్రయాలు జరుపుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారికి అండగా నిలుస్తున్నారని వారు ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలోని రూపరాంపేటలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క పేదవాడికి కూడా స్థలం ఇవ్వకపోగా కనీసం ఇళ్లు కూడా మంజూరు చేయలేని దుస్థితిలో ఉందని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు కేటాయించాలన్నారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి నాగరాజు, మహిళా సంఘం నాయకురాలు విజయమ్మ, ఏఐవైఎఫ్ నాయకులు మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.


