● 13 వరకు టూ టౌన్, వన్ టౌన్ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది
● కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్
కడప : కడపలోని అల్మాస్‌పేట సర్కిల్‌లో ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన సంఘటన దురదృష్టకరం, మతసామరస్యం కలిగిన దేశంగా మన దేశాన్ని పిలుస్తారని ఇందుకు ప్రతి వర్గం వారు కట్టుబడి ఉండాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ తెలియజేశారు. కడప అల్మాస్‌పేట వద్ద హనుమాన్ సర్కిల్ అని ఒక వర్గం వారు, టిప్పు సుల్తాన్ సర్కిల్ అని ఒక వర్గం వారు పరస్పరం రాళ్లు రువ్వుకునేందుకు ప్రేరేపించారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నిందితులను గుర్తించామని కొందరు అదుపులో ఉన్నారని, కొందరు పరారీలో ఉన్నారన్నారు. 144 సెక్షన్ కడప టూ టౌన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈనెల 13వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. తరువాత పరిస్థితిని బట్టి 144 సెక్షన్‌ను సడలింపు చేస్తామన్నారు. ఈ క్రమంలోనే పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, కడప ఇన్‌ఛార్జ్ డిఎస్పీ బాలస్వామిరెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా కడప అల్మాస్‌పేట సర్కిల్ ఈనెల 9న ఉద్రిక్తతల మధ్య అట్టుడికిపోయింది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఆదివారం నిర్మానుష్యంగా మారింది.
అల్మాస్‌పేట ఘటనలో 60మందిపై కేసు
కడప అర్బన్ : కడపలోని అల్మాస్‌పేట సర్కిల్‌లో ఈనెల 9వ తేదీన రాళ్లు రువ్వుకున్న సంఘటనలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు దాదాపు 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులలో కొందరు పోలీసుల అదపులో ఉన్నట్లు సమాచారం.


