గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 8:38 AM

వాల్మీకిపురం : గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో పోస్టల్‌ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని చింతలవారిపల్లి సమీపంలోని నేషనల్‌ హైవేపై చోటు చేసుకొంది. వివరాలు.. సోమల మండలం, కందూరుకు చెందిన ప్రభాకర్‌ ఇదే పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లిలో పోస్ట్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సొంత పనుల నిమిత్తం గుర్రంకొండ మండలం, రామాపురంలోని తన మేనమామ ఇంటికి ద్విచక్రవాహనంపై వచ్చి, తిరిగి ప్రయాణమయ్యాడు. మండలంలోని చింతలవారిపల్లి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఢీకొన్న వాహనం లారీగా గుర్తించి, తిరుపతిలో సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆగి ఉన్న లారీని ఢీకొని..

రామాపురం : మండలంలోని బండపల్లి టోల్‌గేట్‌ సమీపంలో శనివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని బైక్‌ ఢీకొనడంతో తీగల భార్గవాచారి(41) అక్కడిక్కడికే దుర్మరణం చెందినట్లు రామాపురం ఎస్సె శివకుమార్‌ తెలిపారు. పోలీసుల కథనం మేరకు రాయచోటి నుంచి కడప వెళుతున్న లారీకి పంచర్‌ కావడంతో బండపల్లి టోల్‌గేట్‌ సమీపంలో నిలిపి మరమతులు చేపడుతున్నారు. ఇదే సమయంలో రాత్రి 11 గంటలకు రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న స్కూటీ ఆగి ఉన్న లారీ వెనుక భాగంలో బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న తీగల భార్గవాచారి(41)తలకు బలమైన గాయమై అక్కడిక్కడికే మృతి చెందాడు.మృతుడు రామాపురం మండలం సుద్దమల్ల గ్రామంలోని ఎర్రంరెడ్డిపల్లికి చెందిన వాడు కాగా, ప్రస్తుతం రాయచోటి పట్టణం కొత్తపేటలోని చౌడేశ్వరీ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గుండెపోటుకు

గురై యువకుడు..

చౌడేపల్లె : గుండెపోటుకు గురై యువకుడు వెంకటేష్‌(29)మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి.. పరికిదొన పంచాయతీ ఎగువమల్లెలవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు వెంకటేష్‌ సహచర స్నేహితులతో కలిసి ఉదయంనుంచి 11 గంటల వరకు క్రికెట్‌ పోటీలో పాల్గొన్నారు.అనంతరం ఇంటికివచ్చిన వెంకటేష్‌ స్నానం చేసి విశ్రాంతి తీసుకొన్నాడు.అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యసిబ్బంది అప్పటికే వెంకటేష్‌ మృతిచెందినట్లు నిర్ధారించడంతో వెనుతిరిగారు.వెంకటేష్‌ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకొన్నాయి. మృతుడి భార్య నాలుగునెలల గర్ణిణీ.భర్త మృతితో ఆమె, కన్న బిడ్డ మృతితో తల్లిదండ్రుల రోధన పలువురిని కలచివేసింది.

Advertisement
 
Advertisement
Advertisement