కడప కారొపరేషన్/చింతకొమ్మదిన్నె : కడప నగరం అల్మాస్‌పేట ఘటన అత్యంత దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ సంయమనం పాటించాలని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా కోరారు. సీకే దిన్నె, రిమ్స్, చిన్నచౌక్, వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఉన్న యువతను, వారి కుటుంబాలను అంజద్‌బాష పరామర్శించారు. పోలీసులు సంఘటనకు సంబంధం లేని వారిని కూడా అదుపులోకి తీసుకున్నారని, మరోసారి విచారించి సంబంధం లేని వారిని విడుదల చేయాలని ఆయన కోరారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసే జీవించే సంప్రదాయం కడపలో ఉందని, ఎప్పటికీ కడపలో సామరస్యపు జెండానే ఎగురుతుందన్నారు. ఉన్నతాధికారులతో, మత పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. అల్మాస్‌పేటలో జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యం కారణంగా శనివారం దురదృష్టకర సంఘటన జరిగిందని, ఇది చాలా బాధాకరమని అన్నారు.ఆదివారం చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌లో నిర్భందించిన ఇరువర్గాల వారిని అయన పీస్ కమిటీ మెంబర్, వైఎస్సార్ సీపీ నాయకుడు సుభాన్‌బాషాతో కలిసి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ కడప నగరం మత సామరస్యానికి ప్రతీక అన్నారు. అలాంటి కడపలో జరిగిన దురదష్టకరమైన సంఘటనను ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పరామర్శ


