శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు

– కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి,

జిల్లా ఎస్పీ షెల్కే విశ్వనాథ్‌

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గట్టి భద్రతా, రక్షణ చర్యలను పటిష్టం చేస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే విశ్వనాథ్‌ లు సంయుక్తంగా పేర్కొన్నారు. కడపలోని అల్మాస్‌ పేట సర్కిల్లో శనివారం ఉదయం చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో రాత్రి కలెక్టర్‌, ఎస్పీలతోపాటు జేసీ డాక్టర్‌ నిధి మీనా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది అసాంఘిక దుష్టశక్తుల ప్రభావం వల్లనే అల్మాన్‌ పేటలో అల్లర్లు చోటు చేసుకున్నాయని, మత సామరస్యానికి ప్రతీక అయిన కడప నగరాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం యాధృచ్ఛికమే అన్నారు. ప్రజలను వెంటనే ప్రభావితం చేసే సోషల్‌ మీడియా ద్వారా కొంత అవాస్తవ ప్రచారం ప్రజల్లోకి వెళుతోందని, వాస్తవాలను అందించేలా సామాజిక మాధ్యమాలు ఉండాలి తప్ప ప్రజలను భయగోలిపేలా, రెచ్చగొట్టేలా ఉండకూడదన్నారు. అల్లర్లకు కారణమైన వాటిపై చర్యలు తీసుకుని భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు తావులేకుండా చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలు చేసి అల్లర్ల ప్రభావం, ఉనికి ఎక్కడా కనిపించకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు సమైఖ్య భావంతో నడిచేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు తెలిపారు. జిల్లా, నగర ప్రజలకు ఎలాంటి శాంతికి విగాధం లేకుండా జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు.

కడప మత సామరస్యాన్ని కాపాడాలి

కడప నగరం ఎప్పటి నుంచో మతసామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, అలాంటి ప్రాంతంలో విద్వేషాలకు, అల్లర్లకు తావిచ్చే దుష్టశక్తులను ఏమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి స్పష్టం చేశారు. కడపలోని అల్మాస్‌పేట సర్కిల్‌ వద్ద చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో శనివారం రాత్రి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి.. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌తో కలిసి.. జిల్లాలోని అన్ని మతాల సంఘ పెద్దలతో జిల్లా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అన్ని మతాల పండుగలు, ప్రార్థనలకు నిలయమైన కడప నగరంలో పరమత ద్వేషాలకు ఎప్పుడూ తావులేదని స్పష్టం చేశారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ. రాజకీయ ప్రయోజనాల కోసం మత ఘర్షణలను ప్రేరేపించడం సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఐక్యతకు ప్రతీక అయిన కడపలో విద్వేషాలకు స్థానం లేదని, అల్లర్లకు పాల్పడిన వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ సంయమనంతో వ్యవహరించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు మతపెద్దలు, శాంతి కమిటీ సభ్యులు అల్మాస్‌ పేట సర్కిల్‌ కు సంబంధించి.. పేరు మార్పును ఆకాంక్షించే వారి తరపు అభిప్రాయాలను, సలహాలను జిల్లా కలెక్టర్‌, ఎస్పీ లకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో మల్లికార్జునుడు, జిల్లాలోని హిందు, ముస్లిం మత పెద్దలు సామాజిక సంఘాల పెద్దలైన శాంతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అల్మాస్‌పేటలో పర్యటిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, జేసీ తదితరులు, శాంతికమిటీ సమావేశంలో పాల్గొన్న అధికారులు, మత పెద్దలు, నగర ప్రముఖులు

Advertisement
 
Advertisement
Advertisement