ప్రొద్దుటూరు క్రైం: తల్లి ప్రేమ వెలకట్టలేనిది.. త్యాగానికి మరో రూపం అమ్మ. కన్నబిడ్డ కోసం తన జీవితాన్నే ధారపోస్తున్న ఓ మాతృమూర్తి పోరాటం ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఒకవైపు ప్రాణాంతక వ్యాధితో క్షీణిస్తున్న కొడుకు.. మరోవైపు అతడిని కాపాడుకోవాలని తాపత్రయపడే తల్లి.. విధి ఆడిన ఈ వింత నాటకంలో ఆ తల్లి ప్రేమ ‘మందు’ లేని మహమ్మారిపై నిరంతర యుద్ధం చేస్తోంది.
కలలు కన్న వేళ.. కీడు శంకించిన విధి
ప్రొద్దుటూరు కొవ్వూరు గ్యారేజి సమీపంలో నివసించే పతంగె గిరిధర్‌రావుకు, 2013లో గుంతకల్లుకు చెందిన శిల్పతో వివాహమైంది. ఎంఏ హెచ్‌పీటీ చదివిన శిల్ప, వివాహానికి ముందు టీచర్‌గా పనిచేశారు. కుమారుడు శ్రీనివాసరావు పుట్టినప్పుడు ఆ దంపతులు ఎన్నో కలలు కన్నారు. అయితే, నాలుగేళ్ల వయసులో ఆ పసివాడికి ‘డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ’ (DMD) అనే అరుదైన కండరాల క్షీణత వ్యాధి సోకినట్లు తెలియడంతో వారి ప్రపంచం ఒక్కసారిగా చీకటిమయమైంది.
దేశమంతా తిరిగినా దొరకని మోక్షం
బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు బెంగళూరు, చైన్నె, హైదరాబాద్, కేరళలోని ప్రముఖ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా.. ‘ఈ వ్యాధికి మందు లేదు, కేవలం సేవ మాత్రమే శరణ్యం‘ అని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ తల్లి గుండె పగి లింది. అప్పటి నుంచి ఏడేళ్లుగా శిల్ప తన కొడు కు కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉంది.
త్యాగమే తోడుగా..
శ్రీనివాసరావుకు ఇప్పుడు పదకొండేళ్లు. కానీ కనీసం నడవలేడు.. కూర్చోలేడు. సోఫాలో కూర్చోబెట్టినా ఎక్కడ కింద పడిపోతాడోనని శిల్ప క్షణం కూడా పక్క నుంచి తప్పుకోదు. అన్నం తినిపించడం దగ్గర నుంచి కాలకృత్యాల వరకు అన్నీ తానై చూసుకుంటోంది. ఇందుకోసం ఆమె తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న ‘క్లౌడ్ కిచెన్’ వ్యాపారాన్ని, టీచర్ వృత్తిని వదులుకుంది. కొడుకుకు తోడుగా తానూ మిల్లెట్స్ (చిరుధాన్యాలు) తింటూ, బాబుకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
కొడుకును కంటికి రెప్పలా గుండెలకు హత్తుకున్న అమ్మ కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నచిన్నారి శ్రీనివాసరావు
మరో మగ సంతానం కలిగినా ఇదే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఒక వేళ వారికి ఆడపిల్ల జన్మిస్తే ఆమెకు డీఎండీ వ్యాధి వచ్చే అవకాశం ఉండదని, అయితే భవిష్యత్తులో ఆ అమ్మాయికి పెళ్లై మగపిల్లాడు జన్మిస్తే మాత్రం బాలుడికి డీఎండీ వ్యాధి వస్తుందని వారన్నారు. ఈ కారణంగా శిల్ప మాతృత్వాన్ని త్యాగం చేసింది. శిల్ప తన మాతృత్వాన్నే త్యజించింది. ఉన్న ఒక్కగానొక్క కొడు కును సంతోషంగా ఉంచడమే తన జీవితాశయమని నిర్ణయించుకుంది. లోపల కట్టలు తెంచుకుంటున్న బాధ ఉన్నా, కొడుకు ముందు మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటుంది. ‘నేను ఏడిస్తే వాడు తట్టుకోలేడు‘ అంటూ కన్నీటిని దిగమింగుకుంటున్న ఆ తల్లి ప్రేమకు సాటి ఏది? వంద మంది దేవుళ్లు దిగి వచ్చినా అమ్మ చూపే అనురాగం ముందు తక్కువే అని శిల్ప నిరూపిస్తోంది.


