ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగల చేతివాటం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగల చేతివాటం

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

మైదుకూరు : మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ఉదయం ప్రొద్దుటూరుకు చెందిన ఓ మహిళ బ్యాగ్‌ నుంచి 10 తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. మైదుకూరు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లెకు చెందిన కంసల సుభాన్‌బీకి ప్రొద్దుటూరు ఈశ్వర్‌రెడ్డి నగర్‌కు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌తో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వరుసకు తమ్ముడైన యువకుని పెళ్లి కోసం ప్రొద్దుటూరు నుంచి సుభాన్‌ బీ 7వ తేదీ శెట్టివారిపల్లెకు వచ్చింది. వివాహం అనంతరం 9వ తేదీ (శనివారం) ప్రొద్దుటూరుకు వెళ్లేందుకు మైదుకూరు బస్టాండ్‌కు వచ్చింది. మైదుకూరు బస్టాండ్‌లో ఉదయం 8.45 గంటల ప్రాంతంలో బస్సు ఎక్కి టికెట్‌ కోసం ఆధార్‌కార్డు తీసేందుకు బ్యాగ్‌లో ఉన్న పర్సు తీయబోయింది. అప్పటికే పర్సు జిప్‌ తెరిచి ఉండటంతో కంగారుపడి పర్సులో వెతకగా.. అందులో ఉంచిన నల్లపూసల దండ, లాంగ్‌ చైన్‌, హారం తదితర 10 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే బస్సు దిగిన ఆమె భర్తకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారంతా మైదుకూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు.

పీఎండీఎస్‌తో ప్రధాన పంటకు రక్షణ

మైదుకూరు : ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసే పీఎండీఎస్‌ (ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌)తో ప్రధాన పంటకు రక్షణ కలుగుతుందని మైదుకూరు మండలం వనిపెంటలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. శనివారం మండలంలోని ఆదిరెడ్డిపల్లె, తిప్పిరెడ్డిపల్లెలో రైతులు సాగు చేసిన అరటి పంటలో పీఎండీఎస్‌ కింద 20 ఎకరాల విత్తనాలను వెదజల్లారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్‌ శ్రీవిద్యారాణి, డాక్టర్‌ కాంతిశ్రీ, డాక్టర్‌ విజయనిర్మల మాట్లాడుతూ అరటి పంటలో పీఎండీఎస్‌తో ఏర్పడే పచ్చదనంతో అరటి పంటకు వేడి నుంచి రక్షణ కలుగుతుందన్నారు. అదే విధంగా 45–50 రోజుల పాటు కలుపును నివారించవచ్చని పేర్కొన్నారు. అనంతరం 20 రకాల విత్తనాలతో మొలిచిన పంటలతో ఆదాయం పొందడమే కాక పశువుల మేతకు వాడుకోవచ్చని తెలిపారు. ఇంకా మిగిలిన దానిని కలియదున్నితే ప్రధాన పంటకు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం పసుపు పంటపై మహిళా రైతులతో చర్చించారు. సమతుల్యత ఎరువులను వినియోగించాలని సూచించారు. పసుపు పంటను ఎత్తు మడులలో సాగు చేయాలని తెలిపారు.

హక్కుల సాధనకు దళిత క్రైస్తవులు పోరాడాలి

కడప రూరల్‌ : హక్కుల సాధన కోసం దళిత క్రైస్తవులు నడుం బిగించాలని అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్‌ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక పాత రిమ్స్‌లో గల బీసీ భవన్‌లో దళిత క్రైసవ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవుల హక్కుల కోసం మాల, మాదిగ వర్గానికి చెందిన సోదరులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. ఈ అంశానికి సంబంధించి క్రైసవ సంఘాలన్నీ ఏకం కావాలన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ, అనుబంధ సంస్థలకు చెందిన వారు ప్రమాదకంగా మారారన్నారు. ఆ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో గాలి చంద్ర, డేనియల్‌, రమేష్‌ బాబు, సంగటి మనోహర్‌, మల్లెం భాస్కర్‌, జయరాజు, పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొన్నారు.

అదనపు రైల్వేబోర్డు సభ్యుడిగా కె.వి.రెడ్డి

పీలేరు రూరల్‌ : భారతీయ రైల్వే బోర్డులో అత్యుతన్నత గ్రేడ్‌ 16 అదనపు రైల్వే బోర్డు సభ్యుడిగా పీలేరు ప్రాంతానికి చెందిన కె.వి.రెడ్డి (కె.వెంకటరమణారెడ్డి)కి పదోన్నతి లభించింది. కె.వి.రెడ్డి గుంతకల్లు డీఆర్‌ఎంగా, దక్షిణ మధ్య రైల్వేలో పీసీఎస్‌వోగా, ఐఆర్‌ఐఎస్‌ఈటీలో ప్రొఫెసర్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పీలేరు రైల్వే స్టేషన్‌ను అమృత్‌ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయడంలో, అనేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పీలేరులో స్టాపేజీలకు విశేష కృషి చేశారు. ఆయన 1990 ఐఈఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి.

మహిళ బ్యాగ్‌ నుంచి బంగారు చోరీ

Advertisement
 
Advertisement
Advertisement