అనంతపురం సెంట్రల్ : అనంతపురం నగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా కడప నగరం ఆజాద్‌నగర్‌కు చెందిన షేక్ కరీముల్లా కుమారుడు షేక్ మహబూబ్‌బాషా(20), అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన బాబావలి కుమారుడు ఖాసీంవలీ(18) బంధువులు. రెండు రోజుల క్రితం మహబూబ్ బాషా అనంతపురానికి వచ్చాడు. శుక్రవారం ఖాసీంవలీతో కలిసి విద్యుత్‌నగర్ సర్కిల్ నుంచి సంఘమేష్ సర్కిల్ వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ.. రమణ రమేష్ థియేటర్ సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఖాసీంవలీని కర్నూలుకు వైద్యులు రెఫర్ చేశారు. అనంతపురం ఆస్పత్రిలోనే మహబూబ్‌బాషాకు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. ఘటనపై అనంతపురం ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చక్కగా అమలు చేస్తోందన్నారు. జిల్లాలో రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.300 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రాంతంలో రూ.90 కోట్లతో రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. పొట్టిపాడు రోడ్డులో 220 కేవీ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేయించామన్నారు. కార్యక్రమంలో టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, నాయకులు నంద్యాల కొండారెడ్డి, రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, సీఎం సురేష్‌నాయుడు, షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీఎస్ ముక్తియార్, ఆసం రఘురామిరెడ్డి, మహేశ్వరరెడ్డి, టీడీపీ పట్టణాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, వక్ఫ్‌బోర్డు స్టేట్ డైరెక్టర్ జాకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
యువకుడు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : ఎలుకల నివారణ మందు తాగి ఓ డ్రైవర్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చౌడేపల్లి మండలంలోని ఆమనకుంటకు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు చందు(27) ప్రైవేట్ వాహనాలకు డ్రైవర్‌గా పని చేస్తూ, తల్లిదండ్రులతోపాటు భార్య, పిల్లలను పోషించుకుంటూ ఉన్నాడు. కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


