నీడ.. జాడ కరువు
కడప సిటీ: మండుటెండల్లో కాసింత నీడ కరువైంది. చెట్టు నీడే వారికి ఆసరాగా మారింది. ఇక వేసవి అలవెన్సు రాక.. తాగను గుక్కెడు నీళ్లు లేక.. వారి అవస్థ వర్ణణాతీతంగా మారింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల దుస్థితి ఇది. మండు వేసవిలో సౌకర్యాలు కరువై .. పని పథకం బరువైంది. ఇప్పటికే వడదెబ్బతో ఓ శ్రామికుడు మృత్యువాత చెందడంతో కార్మికుల్లో కలవరం మొదలైంది.
నిప్పుల కుంపటిలా....
రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఏకంగా 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. దీంతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా పని ప్రదేశంలో గుడారాలు (షెడ్స్) నిర్మించాల్సి ఉంటుంది. భోజన విరామంలో షెడ్ల నీడనే కూర్చొని భోంచేయడంతో పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే ఆ గూటినీడలోనే ప్రాథమిక చికిత్స అందించడం, ఆ తర్వాత ఆస్పత్రికి తరలించడం చేస్తుంటారు. కానీ నీడ లేకపోవడంతో ఈ పరిస్థితి లేదు. బడ్జెట్ లేనందువల్ల గుడారాలను ఏర్పాటు చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే ఒంటిమిట్ట మండలంలో ఓ శ్రామికుడికి వడదెబ్బ తగిలింది. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఈ పరిస్థితిని చూసి మిగతా వారు బెంబేలెత్తుతున్నారు. పని ప్రదేశంలో చాలా చోట్ల కనీసం తాగునీరు కూడా పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రథమ చికిత్స కిట్లు ఉన్నప్పటికీ వాటి జాడ కనిపించడం లేదు. గతంలో వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగ ఇచ్చే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
వసతులు అంతంత మాత్రమే
ఉపాధి హామీపథకంలో సాధారణంగా వేసవి కాలంలో వేసవి అలవెన్సు కింద అదనంగా వేతనంతో కలిపి ఇస్తారు. ప్రధానంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్‌లో ఈ అలవెన్సు శ్రామికులకు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈ వేసవి అలవెన్సును తీసి వేశారు. గతంలో వేసవిలో సైతం లక్షకుపైగా రోజుకు నమోదు కావా ల్సి ఉండగా, ప్రస్తుతం వేలల్లో మాత్రమే హాజరవుతుండడం గమనార్హం.
21 మంది ఎంపీడీఓలకు నోటీసులు
ఇటీవల కలెక్టర్ శ్రీధర్ జిల్లాలోని 21 మంది ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పనుల పర్యవేక్షణ సరిగా లేదని, కూలీల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఆయన ఆరా తీసి షోకాజ్ నోటీసులు అందజేశారంటే అధికారులు క్షేత్ర స్థాయిలో ఎలా పరిశీలన చేస్తున్నారో అర్థమవుతుంది.
గుడారాలు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధి కూలీలు
చెట్టు నీడలోనే కాలంవెళ్లదీస్తున్న శ్రామికులు
బడ్జెట్ లేదంటున్న అధికారులు
ఇప్పటికే ఒంటిమిట్టలో వడదెబ్బతో ఓ శ్రామికుడు మృతి


