మైదుకూరు : పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డులో ఓ చౌక దుకాణంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీలోని 10వ వార్డు పరిధిలో కొన్ని గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే 34వ దుకాణంలో అధికారులు తనిఖీలు చేశారు. బియ్యం, జొన్నలు, అంగన్‌వాడీలకు వచ్చే సన్నబియ్యం నిల్వలు పంపిణీపై ఆరా తీశారు. వాసంతి అనే మహిళ పేరుతో ఉన్న చౌకదుకాణాన్ని ఆమె బంధువు సుబ్బారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిత్యావసర సరుకుల పంపిణీలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
కడప అర్బన్ : కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గోపాల్‌రెడ్డి కాలనీలో నివాసం వుంటున్న బావమరిది అజయ్‌కుమార్ (19)పై బావ మహమ్మద్ అజీజ్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటనలో నిందితుడైన, రౌడీషీటర్‌గా పేరొందిన మహమ్మద్ అజీజ్ అనే యువకుడిని చిన్నచౌక్ సీఐ బి. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తమ సిబ్బందితో అరెస్ట్ చేశారు. అతనిన కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌కు తరలించారు.
వైద్యసేవల్లో అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కీలకం
రాజంపేట : వైద్యసేవల్లో అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ పాత్ర అత్యంత కీలకమని, అందువల్లనే ఆ కోర్సులకు డిమాండ్ పెరిగిందని అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్‌లర్ చొప్పాగంగిరెడ్డి అన్నారు. శుక్రవారం హెల్త్‌సైన్సెస్ ప్రెషర్స్‌డేలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో హెల్త్‌కోర్సులకు అధిక ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ప్రముఖ జనరల్ సర్జన్ డా.శ్రీకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో హెల్త్ సైన్సెస్ తీసుకొచ్చిన ఘనత ఏయూ అధినేత చొప్పాగంగిరెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబారెడ్డి, గెస్ట్ హాఫ్ ఆనర్ డా.రామ్‌నిఖి చక్రవర్తి, ఎఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, అలైడ్ హైల్త్ ప్రొఫెషనల్స్ ఇన్‌చార్జి ద్వారకనాథరెడ్డిలతో పాటు అధ్యాపకులు, విద్యార్ధులు, తల్లితండ్రులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సన్మానించారు.
కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ ఽథర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లోని 600 మెగావాట్ల ప్లాంట్‌లోని 4వ దశలో పనిచేస్తున్న ఏఎంసీ (యాన్యువల్ మెయింటెన్స్ కాంట్రాక్ట్) కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్టీపీపీలోని 600 మెగావాట్ల ప్లాంట్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు ఆదినారాయణ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఎంసీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నాయకులు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గెలిచిన తర్వాత కార్మికులను ఆవేదనను ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదన్నారు. మా న్యాయమైన డిమాండ్‌లను నెల రోజుల్లోగా పరిష్కంచకపోతే భవిష్యత్‌లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


