ప్రొద్దుటూరు : మున్సిపాలిటీ పరిధిలోని బుడ్డాయపల్లెలో అధికార పార్టీ బలంతో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అక్రమ నిర్మాణం చేపడుతోంది. యధేచ్ఛగా నిర్మాణ పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. బుడ్డాయపల్లెలోని సర్వే నంబర్ 344/2లో 77 సెంట్ల మున్సిపాలిటీ స్థలం ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీ స్థలాన్ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో మున్సిపల్ స్థలం పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలాన్ని గీతాంజలి స్కూల్ యాజమాన్యం కొనుగోలు చేసింది. 15 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి స్కూల్ నిర్మించారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం స్కూల్ ముందు ఉన్న 7 సెంట్ల మున్సిపల్ స్థలంలో అదనపు భవనాలను నిర్మిస్తున్నారు. ఈ 7 సెంట్ల స్థలం విలువ రూ.కోటికిపైగా అవుతుంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ మాత్రం పట్టించుకోని స్కూల్ కరస్పాండెంట్ తనకు అధికార పార్టీ నేతల అండ ఉందని, సమస్య రాకుండా తాను చూసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా యధావిధిగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు కళ్లు తెరవకపోతే మిగతా స్థలం కూడా ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై పాఠశాల కరస్పాండెంట్ శివరామిరెడ్డిని వివరణ కోరగా మున్సిపల్ స్థలంలో కేవలం ప్రహరీ గోడను మాత్రమే నిర్మిస్తున్నామని తెలిపారు. పిల్లల రక్షణ కోసమే నిర్మిస్తున్నామని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రహరీని తొలగిస్తామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.
7 సెంట్ల మున్సిపల్ స్థలంలో
ప్రైవేట్ స్కూల్ నిర్మాణం


