కడప అర్బన్ : కడప నగర శివార్లలోని దేవుని కడప ఆర్చి– మహేంద్ర షోరూం మార్గమధ్యంలో శుక్రవారం కారు, బైక్ నుఢీకొనడంతో డీ. చౌడయ్య (40) అనే బేల్దారి దుర్మరణం చెందాడు. కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్, మృతుని భార్య అమృతమ్మ, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కడపలోని చిన్న చౌక్ వడ్డే కాలనీ లో నివాసం ఉంటున్న దండే చౌడయ్య బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య అమృతమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమృతమ్మ కొన్ని రోజుల క్రితం తన పిల్లలతో కలిసి ఖాజీపేటలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. వారిని పిలుచుకుని రావడానికి బైక్‌లో ఇంటి నుంచి బయలుదేరాడు. సంఘటన స్థలానికి చేరుకునే సరికి ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఎగిరి పడ్డాడు. బైక్, కారుపై పడటంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. చౌడయ్య శరీరమంతా ఛిద్రమైపోయింది. కాసేపు కొన ఊపిరితో కొట్టుమిట్టాడాడు. స్థానికుల సమాచారంతో బంధువులు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. కడప ట్రాఫిక్ సిఐ తులసి రామ్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు.


