జాతర.. జనసంద్రం | - | Sakshi
Sakshi News home page

జాతర.. జనసంద్రం

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

జాతర.. జనసంద్రం

రాజంపేట పట్టణంలోని బలిజపల్లెలో గురువారం గంగమ్మ జాతర సంబరం అంబరమంటింది. బుధవారం రాత్రి నుంచే ప్రారంభమైన జాతరలో భాగంగా తొలుత నారపురెడ్డిపల్లె నిర్వాహకులు, ప్రజలు గంగమ్మ సోదరుడైన పోతురాజును ఊరేగిస్తూ అమ్మవారికి నవధాన్యాలు తీసుకొచ్చారు. అనంతరం గంగమ్మకు పుట్టినిల్లయిన తుమ్మల అగ్రహారం నుంచి ఆ గ్రామ మహిళలు పెద్దఎత్తున గండదీయలను బలిజపల్లెకు తీసుకొచ్చారు. ఈసందర్భంగా ఆ గ్రామానికి చెందిన నిర్వాహకులు, యువకులు తప్పెట్ల దరువుకు, కేరళా వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. కర్రసాము విన్యాసాలతో.. బాణాసంచా వెలుగులతో బలిజపల్లెకు చేరుకున్నారు. బలిజపల్లెలో అమ్మవారి ప్రతిమ తయారైన అనంతరం నిర్వాహకులు గురువారం తెల్లవారుజామున రథంలో గంగమ్మను ఊరేగిస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన వేపమండల గుడిలోకి తీసుకొచ్చి కొలువు దీర్చారు. గంగమ్మను గుడిలోకి తీసుకొచ్చే సమయంలో భక్తులు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. చల్లంగా చూడాలని వేడుకున్నారు.

గంగమ్మను దర్శించుకున్న ఆకేపాటి, పోలా

జాతర సందర్భంగా ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాస్‌రెడ్డి గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ కరుణతో ప్రజలందరు సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. –రాజంపేట టౌన్‌

Advertisement
 
Advertisement
Advertisement