ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

బద్వేలు అర్బన్‌ : జీరామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభల సందర్భంగా గురువారం స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా మార్కెట్‌యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్‌యార్డు ఆవరణలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చేస్తోందని అన్నారు. నిధుల కేటాయింపులో బాధ్యత నుండి తప్పుకునేలా వ్యవహరిస్తోందని, దీనివల్ల ఉపాధి హామీ కూలీలకు కూలీ గిట్టుబాటు కాక పనులు సరిపడక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలందరికి మూడు సెంట్లు ఇంటి స్థలంతో పాటు నిర్మాణ వ్యయానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. రైతులు పండించిన వరి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అలాగే రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివకుమార్‌, అన్వేష్‌, సీఐటీయూ మాజీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి చాంద్‌బాష, సీపీఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్‌, జిల్లాలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement