ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద బుధవారం కుక్కల దాడిలో వన్యప్రాణి కణితి తీవ్రంగా గాయపడింది. ఫారెస్ట్ అధికారుల వివరాల మేరకు..ఒంటిమిట్ట చెరువులోని నీరు తాగేందుకు సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి వచ్చిన కణితిని 7 కుక్కలు వెంటాడి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో కణితి వెనుక వైపు ఉన్న కుడి కాలు పూర్తిగా దెబ్బతింది. అయినా కుక్కలు కణితిని వెంటాడటం వదలలేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు కణితి పొదల్లోకి దూరినా వేట ఆపలేదు. ఈ క్రమంలో అటుగా వెళుతూ అది చూసిన భవన కార్మికుడు యారాసి నాగరాజు వేటాడుతున్న కుక్కలను చెదరగొట్టి, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది ముళ్ల పొదల్లో ఇరుక్కున్న కణితిని కాపాడి, చికిత్స నిమిత్తం స్థానిక పశువైద్య శాలకు తరలించారు. అక్కడ ఒంటిమిట్ట పశుసంవర్ధక శాఖ ఏడీ ఉమా కణితికి ప్రథమ చికిత్స అందించి, ఫారెస్ట్ సిబ్బందిని మూడు రోజుల పాటు కణితికి వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు. అనంతరం గాయపడిని కణితిని స్థానిక అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు.
ఇంటర్ ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : కడపలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ మునీష్ మీనా తెలిపారు.
పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రవేశాలు కేవలం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకే కాకుండా, స్టేట్ బోర్డ్ (ఇ) మరియు ఇతర నాన్–కేవి విద్యార్థులకు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మే 5వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 70361 56284, 08662–225661 నెంబర్లతోపాటు పాఠశాల వెబ్‌సైట్ https://kadapa.kvs.ac.in/ ను సందర్శించవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు
టెంపో ట్రావెలర్ ఢీకొని
రైతు దుర్మరణం
మదనపల్లె టౌన్ : టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన మదనపల్లి మండలంలో బుధవారం రాత్రి జరిగింది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుంగునూరు మండలం అడవినాధుని కుంటకు చెందిన రైతు చెన్నారెడ్డి కొడుకు రవీంద్రనాథ్ రెడ్డి(51), సొంత పనిమీద ద్విచక్ర వాహనంలో మదనపల్లి కు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో వెళుతుండగా మార్గమధ్యలోని పుంగనూరు రోడ్డు నయారా పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ ఢీ కొట్టి రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కళా వెంకటరమణ, ఎస్సై చంద్రమోహన్ ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.


