చనిపోకనే పెన్షన్‌ ఇచ్చి ప్రాణాలు నిలపండి | - | Sakshi
Sakshi News home page

చనిపోకనే పెన్షన్‌ ఇచ్చి ప్రాణాలు నిలపండి

May 7 2026 7:56 AM | Updated on May 7 2026 7:56 AM

మదనపల్లె టౌన్‌ : తాను డయాలసిస్‌ చేయించుకుంటూ రోజులు లెక్కబెడుతూ కాలం వెళ్లదీస్తున్నాను. రోజూ డయాలసిస్‌ చేయించు కోవడానికి ఆర్థిక స్తోమత లేదు. డయాలసిస్‌ చేయించుకోకుంటే ఎప్పుడు చనిపోతానో చెప్పలేమని వైద్యులు తెలిపారు. డయాలసిస్‌ చేయించుకునే ఆర్థిక స్తోమత లేదు. తన బాధను అర్థం చేసుకుని, పెన్షన్‌ మంజూరు చేయిస్తే కొంతకాలమైనా బతుకుతానని ఆశగా ఉంది. ఈ అభాగ్యురాలిపై దయతలచి పెన్షన్‌ మంజూరు చేయించండి సారూ.. అంటూ ఓ యువతి డీఎంహెచ్‌ఓ ను బుధవారం కలిసి వినతి పత్రం అందజేసింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు మండలం , మద్దినాయినిపల్లె పంచాయతీ, బండపల్లికి చెందిన వెంకటరమణ, రామలక్ష్మి దంపతుల కుమార్తె రవణమ్మ (21). ఈమె ఇంటర్‌ వరకు చదువు కుంది. చదువుకునే సమయంలో కడుపునొప్పి అని వెళితే మదనపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యుడు మూడు సార్లు ఆపరేషన్‌ చేసి తన రెండు కిడ్నీలు పాడయ్యేలా చేశాడని తెలిపింది. అప్పటి నుంచి గత ఆరేళ్లుగా డయాలసిస్‌ తో ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ పెన్షన్‌ కోసం తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు.. ఇటీవల మదనపల్లె కలెక్టరేట్‌ కు వెళ్లా పీజీఆర్‌ఎస్‌ లో కలెక్టర్‌కు మొరపెట్టుకుంటే వారు డీఎంహెచ్‌ఓ వద్దకు వెళ్లాలని రాసిచ్చినట్లు తెలిపింది. అందుకే మీ వద్దకు వచ్చాననీ.. తమరైనా పెన్షన్‌ మంజూరు చేయండని సారూ.. అంటూ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ లక్ష్మీనరసయ్యను రవణమ్మ వేడుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement