పీలేరు రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన స్థానిక కడప మార్గంలోని కేవీఆర్ లడ్జీ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. కేవీపల్లె మండలం తీతవగుంటపల్లెకు చెందిన మిన్నంరెడ్డి సుధాకర్‌రెడ్డి(62) ఆర్టీసీ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. స్థానిక కడప రోడ్డు మార్గం ఎస్‌ఆర్ నగర్‌లో నివాసముంటున్న ఆయన మంగళవారం సాయంత్రం కడప రోడ్డు మార్గంలో వాకింగ్ వెళ్లడానికి ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చారు. గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో సుధాకర్‌రెడ్డి తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు. ఆయన్ను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


