● ఉపాధి హామీ కూలీలకు కొత్త విధానం
● వెంటాడుతున్న సాంకేతిక కష్టాలు
● హాజరు కోసం అవస్థలు
జిల్లాలో జారీ చేసిన జాబ్‌కార్డులు
2,30,198
కూలీల సంఖ్య
4,12,054
యాక్టివ్ జాబ్‌కార్డులు
3,08,613
పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య
67,500 (ప్రస్తుతం)
కడప సిటీ : ఉపాధి హామీ పథకంలో వేతన జీవులకు హాజరు కష్టాలు తప్పడం లేదు. కేవైసీ అయిన వేతనదారులకు మాత్రమే ఫొటో అప్‌లోడ్ అవుతుండడం వల్ల కేవైసీ పెండింగ్ ఉన్న వారి పరిస్థితి దారుణంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఉపాధి హామీలో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు గతంలో గ్రూప్ ఫొటో బదులుగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్ (ఎన్‌ఎంఎంఎస్) యాప్‌లో ఒక్కొక్కరి ఫొటో తీసుకున్న తర్వాత పనికి ఉపక్రమించాల్సి ఉంటుంది. కొంతమందికి ఐరిస్ గ్రూప్‌లో ఫొటో తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
ఏప్రిల్ 1 నుంచి అమలులోకి..
సాధారణంగా మార్చి చివరి నాటికి ఉపాధి హామీ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్ అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని సంకల్పించింది. అయితే ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల మే 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏప్రిల్ మాసమంతా పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి హాజరు విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఉపాధి హామీ పథకంలో గతంలో పనికి హాజరయ్యేటపుడు గ్రూప్ ఫొటో తీసేవారు. కానీ కొత్త విధానంలో ఒక్కొక్కరి ఫొటో ఒక్కొసారి తీయాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల సగానికి పైగా కూలీలకు ఐరిస్ యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్ కావడం లేదు. ఎందుకంటే వృద్ధులకు, గతంలో కంటి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తులకు ఫొటో అప్‌లోడ్ కాక హాజరు నమోదు కావడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సమయం వృథా
కొత్త విధానం వల్ల ఒక్కొక్కరి ఫొటో అప్‌లోడ్ చేసేందుకు సమయం వృథా అవుతోంది. ఒక్కొక్క గ్రూప్‌లో 30–40 మంది వరకు ఉంటారు. వీరి ఫొటోలు తీసేందుకు మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. దీంతో వేతనదారులు పని చేసే సమయానికి ఆటంకం ఏర్పడుతుంది. ఇంకా సాంకేతిక లోపం తోడైతే మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో కూలీలు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటి వరకు కేవైసీ 85 శాతం మాత్రమే
జిల్లాలో ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో బయో మెట్రిక్ (కేవైసీ) 85 శాతంగా నమోదైంది. ఇంకా 15 శాతం నమోదు చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం ఊరిలో లేని వారు కొంత మంది ఉన్నారని, వివాహాలు చేసుకుని వేరే ఊర్లకు వెళ్లారని సాకులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో లోపాలు కనిపిస్తున్నాయి. చాలా మంది వృద్ధులకు సింగిల్ ఫొటోలో ఐరిస్ తీసుకోవడం లేదు. అంతేకాకుండా కంటి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తులకు కూడా ఈ పరిస్థితి ఎదురవుతోంది. అటువంటి వారికి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది.
అక్రమాల నిరోధానికి మరింత పకడ్బందీగా..
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో అక్రమాలు నిరోధించేందుకు గతం నుంచి విధి విధానాలను మార్చుకుంటూనే వస్తోంది. అయినప్పటికీ ఏదో ఒక రూపంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికార పార్టీ నాయకులు కలిసి నకిలీ మస్టర్లు తయారు చేసి పనులకు రాకున్నా డబ్బు లు తీసుకునేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధా నం ప్రారంభంలో ప్రతి ఒక్క కూలీ ఫొటోను సింగిల్‌గా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లేటపుడు గ్రూప్ ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదట ఫొటో తీయించుకుని, తర్వాత ఇంటికి వెళ్లి మళ్లీ వచ్చి గ్రూప్ ఫొటో తీయించుకుని అక్రమాలకు పాల్పడేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమయం వృథా కాకుండా పనికి వ చ్చిన వెంటనే కాకుండా భోజన విరామంలో ఫొటోలు అప్‌లోడ్ చేసుకుంటే సమయం కలిసి వస్తుందని కూలీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అక్రమాలు నిరోధించాలంటే ఇంటికి వెళ్లేటపుడు కూడా సింగిల్ ఫొటో తీస్తేనే సాధ్యమవుతుంది.
వంద శాతం కేవైసీకి కృషి
ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో 85 శాతం కేవైసీ పూర్తయింది. ఇంకా 15 శాతం కేవైసీ చేయాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో మరింత పకడ్బందీగా మిగిలిన శాతాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం. సమయం వృథా కాకుండా ఫొటోలు తీసేందుకు పునరాలోచన చేసి చర్యలు తీసుకుంటాం.
– బి.ఆదిశేషారెడ్డి, పీడీ, డ్వామా, కడప


