రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

పోరుమామిళ్ల : పోరుమామిళ్ల కస్తూర్బా గాంధీ పాఠశాల సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతుగంటి ఖాజావలీ(48) అనే వ్యక్తి మృతి చెందాడు. కాశినాయన మండలం చెన్నవరం గ్రామానికి చెందిన ఖాజావలీ బైక్‌లో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. వాహనం ఢీకొట్టడంతో బైక్‌తో సహా ఖాజావలి రోడ్డు పక్కన కాలువలో పడి పోయాడు. చెన్నవరం నుంచి రాజాసాహేబ్‌పేటకు ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన జరిగిన కొద్ది సేపటికే వెనుక వస్తున్న అదే గ్రామానికి చెందిన వారు గమనించి ఖాజావలీని ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. తలకు తీవ్రంగా గాయమైందని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఆసుపత్రిలో చేర్చారని, ఆసుపత్రికి వచ్చిన కొద్దిసేపటికే ఖాజావలి మృతి చెందినట్లు తెలిసింది. ఖాజావలికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారని, ఎవరికీ వివాహం కాలేదని తెలిసింది. ఖాజావలికి జీవనాధారం వ్యవసాయం. మంగళవారం రాత్రికి సమాచారం బంధువులకు తెలిసింది. దాంతో చెన్నవరంలో విషాదం అలుముకుంది. ఈ విషయమై ఎస్‌ఐ హనుమంతును వివరణ కోరగా.. పూర్తిగా తెలియదని, విచారణ చేస్తున్నామన్నారు.

తేనెటీగల దాడి

మదనపల్లె టౌన్‌ : తేనెటీగల దాడిలో పలువురు గాయపడ్డ సంఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. ఘటనపై బాధితుల కథనం.. ముదివేడుకు చెందిన నిర్మలమ్మ(60), చంద్రశేఖర్‌రెడ్డి(50), నిర్మల(40), వారి పిల్లలు గీతిక(7), ఫియాన్సి(5)లు ఊరికి సమీపంలోని వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో పెద్దపెరా తేనెటీగల గుంపు వచ్చి దాడి చేసింది. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానికులు వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి నిర్మలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

కాఫీ మీద పడి..

బాలుడిపై కాఫీ పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం మదనపల్లిలో జరిగింది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు.. మదనపల్లి పట్టణం కొత్త ఇండ్లలో కాపురం ఉంటున్న దంపతులు రామాంజులు, రాణెమ్మలు తాము ఉంటున్న అద్దె ఇల్లును ఖాళీ చేసేందుకు సామగ్రిని సర్ది మూటల్లో భద్రపరిచారు. అలసిపోయిన దంపతులు కాఫీ తాగాలి అనుకున్నారు. వెంటనే రాణి వెళ్లి కాఫీ పెట్టుకుని వచ్చి భర్తకు ఒక గ్లాసులో పోసి తాగమని టేబులుపై పెట్టింది. అదే సమయంలో ఆడుకుంటూ అక్కడికి వచ్చిన ఏడాది కొడుకు నవీన్‌ కాఫీని చేత్తో పట్టుకొని మీద పోసుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు చికిత్స కోసం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో, మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement