లావుగా ఉందని భార్యకు విషమిచ్చి చంపిన భర్త | - | Sakshi
Sakshi News home page

లావుగా ఉందని భార్యకు విషమిచ్చి చంపిన భర్త

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

ప్రొద్దుటూరు : తన భార్య పద్మజ లావుగా ఉందని విషమిచ్చి చంపిన భర్త కిరణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ విభూ కృష్ణ మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. భార్య పద్మజ లావుగా ఉందని, విపరీతమైన మాంసహారం, ఫాస్ట్‌ ఫుడ్‌ తింటుండటం గమనించిన భర్త బద్రిపల్లె కిరణ్‌కుమార్‌ భార్యకు విషమిచ్చి చంపాడన్నారు. ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్‌రెడ్డి నగర్‌కు చెందిన బద్రిపల్లె కిరణ్‌కుమార్‌ 8 ఏళ్ల క్రితం ముద్దనూరుకు చెందిన పద్మజతో వివాహం అయిందన్నారు. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉందన్నారు. భార్యను ప్రొద్దుటూరులోని ఈశ్వర్‌రెడ్డినగర్‌లో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి కిరణ్‌ గత నెల 26న తీసుకొచ్చాడని పేర్కొన్నారు. ఇల్లరికంలో ఉన్న కిరణ్‌కుమార్‌ను చిన్న చూపు చూస్తూ అవమానకరంగా మాట్లాడుతుండే వారని, కిరణ్‌కుమార్‌ మరో మహిళను ప్రేమించినట్లు, దానివల్ల భార్యాభర్తలకు మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. ఎలాగైనా భార్య పద్మజను చంపాలనుకున్న కిరణ్‌కుమార్‌ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండగా, డేంజరస్‌ పాయిజన్‌ అవేలబుల్‌ అనే క్యాప్షన్‌తో వీడియోను చూసి.. అందులోని ఫోన్‌ నంబర్‌కు సంప్రదించి రూ.80 వేలు పెట్టి కొరియర్‌ ద్వారా విషం కొనుగోలు చేశాడన్నారు. గత నెల 29న రాత్రి 11.30 గంటల సమయంలో కవ్వాలో విషం కలిపి భార్యకు కిరణ్‌కుమార్‌ ఇచ్చి ఆమె ముఖంపై ఊపిరి ఆడకుండా తలదిండు ఒత్తి పెట్టడం వల్ల ఆమె మృతి చెందినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. విషం అమ్మిన వ్యక్తి గురించి విచారణ చేస్తున్నామని, తర్వాత విచారణలో విషం అమ్మిన వ్యక్తితోపాటు తయారు చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. తొలుత పద్మజ మృతిని అనుమానాస్పద కేసు కింద నమోదు చేశామని, వన్‌టౌన్‌ సీఐ టీవీ కొండారెడ్డి విచారణ చేసి కేసును నిగ్గుతేల్చారన్నారు. నిందితుడు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో వన్‌టౌన్‌ సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement