రాజంపేట : కవులు, కళాకారుల గడ్డ రాజంపేట అని రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అన్నారు. తాళ్లపాకలో అన్నమాచార్య జయంత్యుత్సవాలలో భాగంగా మంగళవారం అన్నమాచార్య ప్రాజెక్టు(టీటీడీ) వారి సౌజన్యంతో శ్రీ అన్నమాచార్య కళాకారులు ఐక్యవేదిక అధ్యక్షుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి రాజంపేట మండలం తాళ్లపాక కావడం రాజంపేట ప్రాంతీయుల అదృష్టంగా భావించాలన్నారు. అన్నమాచార్య కీర్తనలు నలుదిశలా ఈ ప్రాంత కవులు, రచయితలు కృషిచేయాలన్నారు. అన్నమాచార్య జయంతి రోజున కవులను సన్మానించుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం కవులు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి, సి.జయరామిరెడ్డి, పలుకూరు వెంకటరమణ, గంగనపల్లె వెంకటరమణ, బాలరాజు జనార్ధన్‌రాజు, యూపీ రాయుడు అల్లంఅశోక్‌కుమార్, ఏవీ సుబ్బరాజు, బొడ్డుబోయన రాజగోపాల్, డా.నూకరాజు వెంకటసుబ్బయ్య, అడపాల వెంకటరమణ, హైమావతి, చమర్తి సుబ్బరాఘవరాజు, కొత్తపల్లె రామాంజినేయులుకు టీటీడీ తరఫున పారితోషికంతోపాటు ప్రసాదాలను అన్నమాచార్య ప్రాజెక్టు అధికారి లత అందజేశారు.
కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు చొప్పా ఎల్లారెడ్డి, గుంతకల్ డీఆర్‌యూసీసీ సభ్యుడు తల్లెంభరత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాపినేని విశ్వనాథరెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


