స్టార్టప్‌ టీ హబ్‌ను సందర్శించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌ టీ హబ్‌ను సందర్శించిన కలెక్టర్‌

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌(హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని) అయిన టీ హబ్‌ను కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ సోమవారం సందర్శించారు. యువతకు కొత్త ఆవిష్కరణలు, ఉపాధి, అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో త్వరలో ప్రారంభించనున్న స్టార్ట్‌ అప్‌ కడప ద్వారా కొత్త ఆవిష్కరణలకు వేదిక కానున్న నేపథ్యంలో టీ హబ్‌ను సందర్శించారు. స్టెప్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌, ఆస్పిరేషన్‌ డిస్టిక్‌ బృందం సభ్యులు పాల్గొన్నారు.

ఎంపీహెచ్‌ఎస్‌గా పదోన్నతులు

కడప రూరల్‌: వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయం కార్యాలయం పరిధిలో సోమవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మీటింగ్‌ హాల్‌లో ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) నుంచి ఎంపీహెచ్‌ఎస్‌గా నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జోన్‌–4 పరిధిలో మొత్తం 86 మందికి గాను 77 మంది పదోన్నతులు పొందారు. ఆ శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రామ గిడ్డయ్య, డిప్యూటీ డైరెక్టర్‌ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్‌ వెంకటసుబ్బమ్మ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: జిల్లాలోని ప్రతి పాఠశా ల,కళాశాల బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు విజయ్‌ భాస్కర్‌, ఇస్మాయిల్‌, ఏఎంవీఐ లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు. సోమవారం ఊటుకూరులోని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో పాఠశాల, కళాశాల బ స్సులను తనిఖీ చేశారు. ఫిట్‌నెస్‌ పత్రాలు లేకుంటే వాహనాన్ని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

టీడీపీ నేతపై కేసు నమోదు

ప్రొద్దుటూరు : స్థానిక శ్రీరామ్‌ ఫైనాన్స్‌ డివిజనల్‌ మేనేజర్‌ బాబా ఫకృద్దీన్‌పై దాడి చేసిన సంఘటనకు సంబంధించి రాష్ట్ర వాల్మీకి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, టీడీపీనేత నల్లబోతుల నాగరాజుతోపాటు మరికొంత మందిపై త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లబోతుల నాగరాజు శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో రూ.40లక్షల రుణాన్ని 2024లో తీసుకున్నారు. ఈ రుణానికి సంబంధించి ప్రతినెల రూ.1.31 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఐదు నెలలుగా కంతులు చెల్లించకపోవడంతో గత నెల 30న డివిజనల్‌ మేనేజర్‌ టీడీపీ నేతకు ఫోన్‌ చేశారు. ఈ విషయంపై నాగరాజు తన ఇంటికే ఫోన్‌ చేస్తా వా అని శ్రీరామ్‌ ఫైనాన్స్‌ కార్యాలయానికి వెళ్లి బాబాఫకృద్దీన్‌పై దాడి చేసి కార్యాలయంలో దౌర్జన్యం చేశారు. పోలీసులు డివిజనల్‌ మేనేజర్‌ ఫిర్యాదు ఆధారంగా కోర్టుకు పంపడంతో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు.

ఉద్యోగాల పేరుతో

టోకరా

కడప అర్బన్‌: రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నబీకోటలో నివాసముంటున్న ఎలిశెట్టి రవిచంద్ర ఏపీజీబీలో పనిచేస్తూ వీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. తన కుమారుడు, కూతురికి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో యోహాన్‌, శ్రీనివాసులు, అభినవ్‌ సింగ్‌ పరిచయమయ్యారు. తాము రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో రవిచంద్ర తన వీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన డబ్బును సదరు ముఠాకు విడతలవారీగా రూ.34.50 లక్షలను వారి ఖాతాలకు జమ చేశాడు. ఈ నేపథ్యంలో సదరు ముఠా సభ్యులు రవిచంద్రకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారు. వాటిని రైల్వే అధికారుల వద్దకు తీసుకెళ్లిన ఆయనకు అసలు విషయం తెలిసింది. మోసపోయానని గ్రహించిన రవిచంద్ర పోలీసులను ఆశ్రయించారు. కడప తాలూకా సీఐ నరసింహారాజు బాధితుడి ఫిర్యాదును స్వీకరించి కేసు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement