కష్టమంతా నేలపాలు ! | - | Sakshi
Sakshi News home page

కష్టమంతా నేలపాలు !

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

జిల్లాలో పలుచోట్ల

ఈదురుగాలుల బీభత్సం

నేలకూలిన అరటి..

మామిడి, నిమ్మ పంటకు నష్టం..

విరిగిపడ్డ విద్యుత్‌ స్తంభాలు

వేంపల్లె/చింతకొమ్మదిన్నె/పెండ్లిమర్రి : అసలే పంట ఎగుమతుల్లేక.. ఆపై ధరల్లేక అష్టకష్టాలు పడుతున్న రైతులకు గాలివాన మరింత కష్టాలోకి నెట్టింది. చేతికొచ్చే పంటను నేలవాల్చి తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. ఆది, సోమవారాల్లో వీచిన గాలులకు పెద్ద మొత్తంలో అరటి పంట నేలకొరిగింది. వేంపల్లె, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాల్లో భారీ స్థాయిలో పంట దెబ్బతింది. వేంపల్లె మండలంలోని అయ్యవారిపల్లెకు చెందిన రైతు చంద్రశేఖర్‌ రెడ్డి తన 3ఎకరాల్లో సాగుచేసిన 800 అరటి చెట్లు నేలకొరిగాయి. దాదాపు రూ.5లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. అలాగే వేంపల్లెకు చెందిన మురికూటి రెడ్డయ్య పాములూరు రోడ్డులోని పంట పొలాల్లో సాగు చేసిన అరటి చెట్లు నేలకూలాయి. దాదాపు రూ.4లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు

భారీ ఈదురుగాలులకు వేంపల్లెలోని పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు 3 గంటలపాటు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

ఈదురుగాలుల బీభత్సం

చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె, బుగ్గలపల్లె తదితర గ్రామాలలో వేసిన అమృతపాణి రకం చెట్లు పూర్తిగా నేలకూలగా, గ్రాండ్నైన్‌ రకం అరటి తీవ్రంగా ఊగిపోవడంతో పంట నాణ్యత తెబ్బతింది. బుగ్గలపలెకు చెందిన రైతు శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ తన రెండు ఎకరాల అమృతపాణి అరటి చెట్లు కూలడంతో పెట్టుబడితో పాటు ఏడాదిపాటు పడ్డ కష్ట మంతా నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మామిడి తోటలలో అక్కడక్కడా కాయలు రాలాయి.

పెండ్లిమర్రి మండలంలో..

పెండ్లి మర్రి మండలంలో ఆదివారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. మాచునూరు, రేపల్లె, కొత్త సంగటి పల్లె, పెండ్లిమర్రి, వెల్లటూరు, చిన్న దాసరి పల్లె, చీమల పెంట, తదితర గ్రామ పొలాల్లో సాగులో ఉన్న అరటి నిమ్మ మామిడి తోటలు దెబ్బతిన్నాయి. సుమారు 200 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరి కొన్ని గ్రామాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement