● ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్షణ లేదు
● ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు
● దశరథరామిరెడ్డికి అండగా నిలుస్తాం
● వైఎస్సార్‌సీపీ నేతలు
ఆకేపాటి, కొరముట్ల, చింతల
సాక్షి, మదనపల్లె: రెండేళ్ల కూటమి పాలన ఆటవిక రాజ్యాంగ మారిందని, రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఆదివారం రాయచోటిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరామిరెడ్డిపై టీడీపీ మూకల పాశవిక దాడి, హత్యాయత్నం ఘటనపై ఆ పార్టీ నేతలు సోమవారం మదనపల్లెలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు జి.షమీంఅస్లాం, మున్సిపల్ మాజీ చైర్మన్ వి.మనూజ, పార్టీ నేతలు కార్యాలయంలో ఎస్పీని కలిశారు. రాయచోటిలో దశరథరామిరెడ్డిపై జరిగిన దాడి, హత్యాయత్నం, ఆస్తినష్టం గురించి ఎస్పీకి వివరించారు. మూకదాడిలో గాయపడిన బాధితుల గురించి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు దారుణమని, తక్షణమే చర్యలు తీసుకొని బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని విన్నవించారు. దీనిపై స్పందించిన ఎస్పీ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని నేతలు ఆ తర్వాత తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు.
రక్షణ ఎక్కడ
కూటమిపాలన వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అన్నారు. అధికార అండతో దాడులకు తెగబడుతున్నారని, ఆస్తులను ఆక్రమిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దశరథరామిరెడ్డిపై పైశాచికంగా జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని తెలిపారు. దౌర్జన్యానికి పాల్పడి హత్యాయత్నానికి తెగబడటం ఆటవిక రాజ్యం కాదా అని ప్రశ్నించారు. ప్రశాంతమైన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని చెప్పారు. . దశరథరామిరెడ్డి పై జరిగిన దాడికి ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, తామంతా అండగా ఉన్నామని చెప్పారు. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు, దశరథరామిరెడ్డికి న్యాయం జరిగేదాకా పార్టీ అండగా ఉంటుందని, పోరాటం చేస్తామని అన్నారు.
ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోస్తున్నారా
ఫ్యాక్షన్ రాజకీయాలకు మళ్లీ ఆజ్యం పోస్తున్నారా అని టీడీపీ నేతలను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. 30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను రాయచోటిలో మళ్లీ పునరావృతం చేస్తున్నారని అన్నారు. దశరథరామిరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడి అశాంతి సృష్టించారని అన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


