రారండోయ్‌.. ట్రిఫుల్‌ ఐటీకి | - | Sakshi
Sakshi News home page

రారండోయ్‌.. ట్రిఫుల్‌ ఐటీకి

May 4 2026 7:13 AM | Updated on May 4 2026 7:13 AM

● నాడు వైఎస్సార్‌ చలవతో...

ప్రవేశాల షెడ్యూల్‌ ఇలా...

వేంపల్లె: ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాల సందడి మొదలైంది.పదో తరగతి తర్వాత అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎదురుచూసే అవకాశమిది. ఆర్జీయూకేటీ సంస్థలో పేద, మధ్యతరగతి విద్యార్థులు చేరేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు ట్రిపుల్‌ ఐటీలో సీట్లు పొందుతున్నారు. ఇక్కడ చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల చూపు ట్రిపుల్‌ ఐటీ వైపు మళ్లింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 4 వేల ట్రిపుల్‌ ఐటీ సీట్లలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమానంగా కేటాయిస్తారు . శుక్రవారం నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. స్పెషల్‌ కేటగిరి (పీహెచ్‌/ఎన్సీసీ/ స్పోర్ట్స్‌/ భారత్‌ స్కౌట్స్‌) సర్టిఫికెట్‌ వెరిఫికేషన్లు జూన్‌ మొదటి వారం లో చేపట్టి ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్‌ ఐటీలు :

రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్‌ ఐటీలు ఉన్నాయి., ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. ఒక్కో ట్రిపుల్‌ ఐటీలో సుమారు వెయ్యి సీట్లు ఉన్నాయి. ఓబీసీ కింద ఒక్కో ట్రిపుల్‌ ఐటీకి 100 సీట్లు అదనంగా కేటాయించగా మొత్తం కలిపి 4400 సీట్లు అవుతాయి. ఏటా 60 శాతం దాటి బాలికలు సీట్లు సాధిస్తున్నారు. సమీకృత ఇంజినీరింగ్‌ కోర్స్‌ ఆరేళ్లు కాగా .. అందులో రెండేళ్ల పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్స్‌), నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ లో చేరుతారు. నూతన విద్యా విధానం –2020 మేరకు పీయూసీ పూర్తి చేసిన విద్యార్థులు రిలీవ్‌ కావచ్చు. ఇంజనీరింగ్‌ సైతం ఏటా రిలీవ్‌ కావచ్చు. విద్యార్హత ఆధారంగా ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఇంజనీరింగ్లో సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ, సీఎస్‌ఈ, ఈసీఈ వంటి బ్రాంచ్‌ లు నిర్వహిస్తున్నారు. రిలీవ్‌ అయ్యే విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించడంతోపాటు గేట్‌ వంటి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య సైతం అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు.

దరఖాస్తుల స్వీకరణ..ఎంపిక ప్రక్రియ :

2026–27 విద్యా సంవత్సరానికి రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ)లో ఆరేళ్ల సమీకృత బీటెక్‌ కోర్సులో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రవేశాలను వేగవంతం చేస్తూ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి సౌజన్యంతో అడ్మిషన్ల కన్వీనర్‌ డాక్టర్‌ అమరేంద్ర కుమార్‌ సండ్ర షెడ్యూల్‌ విడుదల చేశారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇద్దరికి సమాన మార్కులు వస్తే ముందు గణితం, తరువాత జనరల్‌ సైన్స్‌, ఇంగ్లీషు, సోషియల్‌, చివరిగా ఫస్ట్‌ లాంగ్వేజీలో మార్కులు పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తారు. అప్పటికీ సమ ఉజ్జీగా ఉంటే పుట్టిన తేదీ, హల్‌ టిక్కెట్‌ నంబర్‌ నుంచి పొందిన అత్యల్ప సంఖ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులను మే ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌( డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ, ఆర్జేయుకేటీ.ఇన్‌/ ఎపీ వైబ్సెట్‌) ద్వారా స్వీకరించనున్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఓసీ విద్యార్థులకు దరఖాస్తు రుసుం రూ.400, ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు రూ.250గా నిర్ధారించారు. జూన్‌ 12వ తేదీన ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. గతేడాది జూలై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమైనప్పటికీ.. ఈసారి 15 రోజులు ముందుగానే అంటే జులై 1 నుంచే పీయూసీ–1 తరగతులను ప్రారంభించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాత విద్యార్థులకు జూన్‌ 29 నుంచే 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున, కొత్త వారు కూడా వారితో కలిసి చదువు కొనసాగించేలా ఈ మార్పు చేశారు.

2026–27 విద్యా సంవత్సరానికినోటిఫికేషన్‌ విడుదల

ఆన్‌లైన్‌ దరఖాస్తులకుఈనెల 30 తుది గడువు

అన్ని జిల్లాలకు సమానంగా సీట్ల కేటాయింపు

రాష్ట్రంలోని 26 జిల్లాలకు సమానంగా విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీ సీట్లను ఆర్జీయూకేటీ అధికారులు కేటాయించనున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి పాసైన విద్యార్థులకు నాలుగు శాతం డిప్రియేషన్‌ స్కోర్‌ జోడించి మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి అధిక సీట్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– ఏవీఎస్‌ కుమారస్వామి గుప్తా,

ఆర్కే వ్యాలీ త్రిబుల్‌ ఐటీ డైరెక్టర్‌, ఇడుపులపాయ

గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించేందుకు 2008లో మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్‌ ఐటీలు ఏర్పాటు చేశారు. ప్రారంభం లో ఒక్కో ట్రిపుల్‌ ఐటీ కి 2వేల సీట్లు కేటాయించగా, 2010లో ఒక్కో ట్రిపుల్‌ ఐటీలో వెయ్యి సీట్లు ఉండేలా కుదించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్‌ ఐటీ తెలంగాణకు వెళ్లడంతో 2016లో ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్‌ ఐటీలు ప్రారంభించారు. ట్రిపుల్‌ ఐటీల్లో 26 జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు ఇచ్చేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయించి 4 వేల సీట్లలో ఓపెన్‌ కేటగిరీలో 600 సీట్లను స్థానికేతరులు, తెలంగాణ, ఎన్‌ఆర్‌ఎ తదితరులకు, మిగిలిన 3,400 సీట్లను 26 జిల్లాల వారికి సమానంగా కేటాయిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement