బైక్‌ను ఢీ కొట్టిన కారు:ఒకరికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీ కొట్టిన కారు:ఒకరికి తీవ్రగాయాలు

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

రాజంపేట : పట్టణంలోని జీకేఎస్సార్‌ కల్యాణమండపం(తిరుపతి బైపాస్‌రోడ్డు)లో ఆదివారం గుర్తుతెలియని కారు, బైక్‌ను ఢీ కొట్టింది. బైక్‌పై వెళుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఢీ కొట్టిన కారు వెళ్లిపోయింది. పోలీసులు సంఘటన స్ధలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణపాయం లేదని పోలీసులు తెలిపారు.

పడవ కాల్చివేత

లింగాల : లింగాల మండలం పార్నపల్లి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(సీబీఆర్‌) వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పడవను కాల్చివేశారు. డ్యామ్‌లో ఎవరు చేపలు పట్టకుండా.. గస్తీ తిరిగేందుకు కాంట్రాక్టర్‌ పడవను ఏర్పాటు చేశారు. మత్సకార సంఘానికి సంబంధించిన చిన్నకోట్ల, పెద్దకోట్ల, పార్నపల్లి గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులకు చేపల కాంట్రాక్టర్‌ అయిన తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన యాదగిరి ఒక గస్తీ పడవను మత్స్యకార సంఘానికి ఇచ్చారు. శనివారం రాత్రి బోటును డ్యామ్‌ వద్ద ఉంచి మత్స్యకారులు ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు పాత ఆటో టైర్లను పడవలో వేసి నిప్పు పెట్టినట్లు మత్స్యకారులు తెలిపారు. ఆదివారం ఉదయం వద్దకు వెళ్లగా పడవ కాలిపోయిందని చెప్పారు.మత్స్యకార సంఘం సర్పంచ్‌ సూర్యనారాయణ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బోటు విలువ సుమారు రూ. 4,70,000 ఉంటుందని ఆయన అన్నారు. లింగాల ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి సీబీఆర్‌ వద్దకు వెళ్లి పడవను పరిశీలించారు. సీబీఆర్‌పై ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

గుండెపోటుతో హైదరాబాద్‌ వాసి మృతి

కలికిరి : గుండెపోటుకు గురై హైదరాబాద్‌ వాసి మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం కలికిరిలో చోటు చేసుకుంది. వివరాలు.. హైదరాబాద్‌ నగరం ప్రగతి నగర్‌కు చెందిన కనుకుంట్ల రాజేందర్‌(60) కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన ఆర్‌.శ్రీనివాసులు రెడ్డికి స్నేహితుడు. రాజేందర్‌ హైదరాబాద్‌లో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ... బెంగళూరు, చింతామణి, మదనపలె ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం నిమిత్తం వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం హైదరాబాదు నుంచి బెంగళూరు, చింతామణికి వచ్చి కలికిరికి వచ్చాడు. రెండురోజుల తర్వాత శ్రీనివాసులు రెడ్డి సొంత పనుల నిమిత్తం హైదరాబాదు వెళ్లాడు. రాజేందర్‌ మిత్రుడి రూములో ఉన్నాడు. ఆదివారం ఉదయం శ్రీనివాసులు రెడ్డికి ఫోన్‌ చేసి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పాడు. దీంతో అతని సూచన మేరకు స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో టిఫిన్‌ చేసి రోడ్డుపైకి వచ్చి గుండె పోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు మృతుని సెల్‌ఫోన్‌ ఆధారంగా శ్రీనివాసులురెడ్డికి సమాచారమిచ్చారు. స్నేహితుని ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతుడు కనుకుంట్ల రాజేందర్‌ ప్రముఖ సినీ రచయిత చంద్రబోస్‌కు స్వయాన సోదరుడు. మృతుని భార్య వసంత కూడా తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement