ప్రొద్దుటూరు కల్చరల్ : విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని కడప తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గ్రాండ్ మాస్టర్ ఎం.నాగూర్ బాబు పేర్కొన్నారు. స్థానిక శ్రీకృష్ణగీతాశ్రమంలోని శ్రీవెంకటేశ్వర డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో ఫస్ట్ కడప డిస్ట్రిక్ట్ ఇన్విటేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక దృఢత్వంతోపాటు ఏకాగ్రత పెరుగుతుందన్నారు. తైక్వాండోలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన వారికి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం ఉందని, దీనిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండు నెలలకోసారి ఈ ఇన్విటేషన్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రతి మండలంలో నిర్వహించాలని సూచించారు. నిమిషానికి 177 కిక్స్ చేసిన ఎస్‌వీడీసీ విద్యార్థిని అభినందించారు. వచ్చే ఏడాది నిర్వహించే కిక్ ఛాంపియన్ పోటీల్లో గెలుపొందిన వారికి రూ.10వేల నగదు బహుమతి అందిస్తామన్నారు. వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ అరకటవేముల హరినారాయణ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదపడుతాయన్నారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలలకు చెందిన 250 మంది తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. క్రీడాకారులకు జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పట్టణానికి చెందిన ఎస్‌వీ తైక్వాండో అకాడమీ వారు ప్రథమ స్థానం, కమలాపురం సుమన్ తైక్వాండో అకాడమీ వారు ద్వితీయ స్థాం, కడప విజయలక్ష్మి తైక్వాండో అసోసియేషన్ వారు తృతీయ స్థానంలో నిలిచారు. గెలుపొందిన వారికి ట్రోఫీలను, మెడల్స్, సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో ఎస్వీ తైక్వాండో అకాడమీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.శ్రీనివాసులు, ఎస్‌వీడీసీ కోఆర్డినేటర్ గౌరీశంకర్, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దునూరు, బద్వేలు, మైదుకూరు ప్రాంతాలకు చెందిన తైక్వాండో మాస్టర్లు, క్రీడాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


