కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు కన్నీరు దేశానికి మంచిది కాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల గూర్చి పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. ఈ 23 నెలల కాలంలో రైతులకు ఇవ్వాల్సిన పంటల బీమాగానీ, పెట్టుబడి రాయితీగానీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పంటల బీమా మంజూరైందని పత్రికా ప్రకటనలు తప్ప రైతులకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రెండు రోజుల క్రితం ఆకాల వర్షం, విపరీత గాలుల వల్ల అరటి, బొప్పాయి, వంటి పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. కనీసం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. రైతుల గోడును వినేవారు కరువయ్యారన్నారు. ఒకట్రెండు పంటలకు 95 శాతం పంటకోత జరిగి పంట అమ్మిన తర్వాత దళారీల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ధరల స్థీరికరణ నిధికి కేటాయించిన రూ.5వేల కోట్లు ఏమయ్యాయో తెలీని పరిస్థితి ఉందన్నారు. దాదాపు 90 శాతం పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు జీఎన్ భాస్కర్‌రెడ్డి, ఉత్తమారెడ్డి, సుబ్బారెడ్డి, సురేష్ యాదవ్, రాజశేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి


