● జీవితం రుచి తెలిపే పండగ ఉగాది
● పంచాంగ పఠనానికి ఏర్పాట్లు పూర్తి
తెలుగు
లోగిళ్లకు
కడప సెవెన్‌రోడ్స్ : తెలుగు సంవత్సరాది..ఉగాది పర్వదినాన్ని గురువారం జిల్లా ప్రజలు నిర్వహించుకోనున్నారు. తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఉగాదితోనే. ఈ సందర్భంగా జిల్లాలోని తెలుగులోగిళ్లు నవ వసంత శోభను సంతరించుకున్నాయి. దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్ సభా భవనంలో పంచాంగ పఠనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే పలు ఆలయాల్లో కూడా పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. ఈ ఏడు వర్షాలు, పాడి పంటలు, ధరలు వంటి విషయాలను పంచాంగ పఠనం చేసే పండితులు తెలియజేస్తారు.
కష్టసుఖాల సమ్మేళనం జీవితం..
జీవితాంతం హాయిగా..ఎలాంటి కష్టాలు లేకుండా సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. ఎంత వద్దనుకున్నా..ఎంత ధనవంతులకై నా కష్టాలు తప్పవు....జీవితమంటే కష్టసుఖాల కలయిక అని తెలుపుతూ ఉగాది పండుగ నాడు షడ్రుచులతో ఉగాది పచ్చడి స్వీకరిస్తారు. జీవితమంటే చేదు, తీపిల కలయిక అని సందేశం ఇవ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యం చేకూర్చే ఉగాది పచ్చడిని ప్రతి తెలుగింటిలోనూ తప్పక తయారు చేస్తారు. ఈ సీజన్‌లో వచ్చే ఎన్నో వ్యాధులను ఈ పచ్చడి తినడం ద్వారా నివారించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
కవుల పండుగ
ఉగాదిని కవుల పండుగగా చెప్పవచ్చు.పండుగ నాడు కవి సమ్మేళనాలు నిర్వహించి అంతో ఇంతో సంభావన ఇచ్చి కవులను సత్కరించడం పండుగ సంప్రదాయం. కవులను దార్శనికులుగా భావిస్తారు గనుక వారి కవిత్వాన్ని ఈ పండుగ సందర్భంగా శ్రద్ధగా వింటారు. వైఎస్సార్ జిల్లాను కవుల గడపగా పేర్కొంటారు. జిల్లా అంతటా స్వచ్ఛంద సేవా సంస్థలు, సమాజానికి సేవ చేస్తున్న వారికి ఉగాది పురస్కారాలు అందజేయనున్నారు.
మత సహనం
మన జిల్లాను మత సహనానికి మారుపేరుగా పేర్కొంటారు. ఉగాది సందర్భంగా దేవునికడప ఆలయంలో పలువురు ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట, రాయచోటిలలో కూడా ఈ ఆచారం ఉంది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వెలుపల నాటి ముస్లిం ప్రముఖులు తవ్వించిన ఇమామ్ బేగ్ బావి మత సామరస్యానికి మారుపేరుగా నేటికీ నిలిచి ఉంది. కడప నగరం బ్రాహ్మణ వీధిలోని జూల ఆంజనేయస్వామి ఆలయాన్ని కడప నిర్మితమైన తొలిరోజుల్లో ముస్లిం సుల్తాన్ నిర్మింపజేసినట్లు తెలుస్తోంది.
పండుగ సందడి
ఉగాది పండుగను పురస్కరించుకుని జిల్లాతోపాటు కడప నగరంలో సందడి నెలకొంది. ఉదయం నుంచి నగరంలోని వైవీ స్ట్రీట్, ఇతర వాణిజ్య కూడళ్లలో ప్రజలతో రద్దీగా కనిపించాయి. దుస్తులతోపాటు మార్కెట్‌లో నిత్యావసర సరుకుల కొనుగోళ్లు కొనసాగాయి. అలాగే వన్‌టౌన్ సర్కిల్, పాత బస్టాండు, ఆర్టీసీ బస్టాండు, దొంగల చెరువు కట్ట, ఐటీఐ సర్కిల్ తదితర ప్రాంతాల్లో అరటి పిలకలు, మామిడాకులు, పూలు, పండ్లు, టెంకాయలు, ఇతర పూజా సామాగ్రి కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం అన్నింటి ధరలు పెరిగినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే పండుగ నిర్వహణకు ప్రజలు సిద్ధమయ్యారు.
కడపలో మామిడాకులుకొంటున్న జనం


