మదనపల్లెటౌన్ : భర్తతో దూరంగా ఉంటూ అనాథ ఆశ్రమంలో రిసెష్పనిస్టు ఉద్యోగం చేసుకుంటున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం వెలుగు చూసిన ఘటనపై టూటౌన్ పోలీసుల కథనం మేరుకు.. మదనపల్లె మండలం, బసినికొండకు చెందిన తేజ కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో వాల్మీకిపురం మంలం, చింతపర్తికి చెందిన చంద్రయ్య, రమణమ్మ దంపతుల కుమార్తె స్వాతి(29)ని ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో భార్య భర్తల మధ్య మనస్పర్థల కారణంగా విభేదాలు తలెత్తి గొడవపడి విడిపోయారు. అప్పటి నుంచి స్వాతి పట్టణంలోని బర్మావీధిలోని చైతన్య సర్వీసెస్ సోసైటీ(అనాథ పిల్లల ఆశ్రమం)లో రిసెష్పనిస్టుగా పనిచేస్తూ అక్కడే ఉంటోంది. భార్య భర్తలు ఇద్దరు ఐదేళ్ల క్రితం కోర్టులో కేసులు వేసుకున్నారు. వాయిదాలకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏమి జరిగిందో ఏమో స్వాతి తాను ఉంటున్న సొసైటీలోని గదిలో మంగళవారం అర్థరాత్రి తన చున్నీతో భవంనం పైకప్పునకు ఉన్న కమ్మీకి ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఉదయం గమనించిన సొసైటీ సిబ్బంది వెంటనే రెండో పట్టణ పోలీసులకు, మృతురాలి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు ఆశ్రమానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


