కడప అర్బన్ : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మహిళా భద్రతపై గ్రామాలు, కాలనీలు, పాఠశాలలు, కళాశాలలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశపు హాల్ లో మైదుకూరు, రాజంపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో వేర్వేరుగా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, స్కూళ్లు, కాలేజీల్లో సోషల్ మీడియా వల్ల మహిళలు, బాలికలకు కలిగే వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు. గస్తీ ని పెంచాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాహనాల రికార్డులు తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, నిర్ణీత వ్యవధిలోగా చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దష్టి సారించి గస్తీని పెంచడంతో పాటు గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకష్ణ, మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు సబ్ డివిజన్‌లోని సీఐలు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.
ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ‘శ్రీ పరాభవ‘ నామ సంవత్సర ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్ని ఇవ్వాలని, తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఎస్పీ ఆకాంక్షించారు. రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని పేర్కొన్నారు.
ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


