కడప కార్పొరేషన్ : విజయవాడలోని మంగళగిరిలో డాక్టర్స్ స్పోర్ట్స్ ఆకాడమీ వేదికగా నిర్వహించిన కామ్రెడ్ ఎన్‌వీఎస్ స్పోర్ట్స్ కార్నివాల్–2026లో రాష్ట్ర స్థాయిలో పోటీల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప జట్టు ప్రతిభ కనబరిచిందని బ్యాంకు రీజనల్ మేనేజర్ ఏ. లక్ష్మి తులసి తెలిపారు. బుధవారం క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకు సేవల్లో తీరిక లేకుండా ఉండే అధికారులు, సిబ్బందికి క్రీడలు మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయన్నారు. బ్యాంకు కార్యకలాపాలతోపాటు క్రీడల్లో కూడా రాణించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో కడప యూనియన్ బ్యాంకు జట్టు మూడో స్థానం సాధించిందన్నారు. అలాగే టగ్ ఆఫ్ వార్‌లో కడప జట్టు రాష్ట్ర చాంపియన్‌గా నిలించినట్లు చెప్పారు. క్రీడా స్ఫూర్తి, పట్టుదలతో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్కూల్ వ్యాన్ ఢీ:
వ్యక్తికి తీవ్ర గాయలు
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని కడప రోడ్డులో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ఢీకొని నరసింహులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని శ్రీ గౌతమ్ హైస్కూల్‌కు చెందిన వ్యాన్ మధ్యాహ్నం విద్యార్థులతో కడప రోడ్డు మార్గలో వెళుతోంది. అదే సమయంలో నల్లింగాయపల్లి గ్రామానికి చెందిన నరసింహులు ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూల్‌కు తీసుకెళ్లారు.
చెరువులో పడిన కారు
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని రామతీర్థం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారును లారీ ఢీ కొట్టడంతో కారు చెరువులో పడింది. పోలీసుల వివరాల మేరకు..కడప నుంచి ఆకేపాడుకు వెళుతున్న కారు ఒంటిమిట్ట రామతీర్థం వద్ద చెరువు కట్టపైకి రాగానే రాజంపేట నుంచి వస్తున్న ఓ లారీ ఢీ కొట్టడంతో పక్కనే ఉన్న చెరువులో పడింది. డ్రైవర్ కదిరి బ్రహ్మయ్య కారు డోరు తెరచుకుని ఈదుకుంటూ బయటకు వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు.పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని చెరువులో పడిన కారును బయటకు తీయించారు. దెబ్బతిన్న కారును, ప్రమాదానికి కారణమైన లారీని స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు.
బాలుడిపై లైంగిక దాడి :
ఆటో డ్రైవర్‌పై కేసు
మదనపల్లెటౌన్ : బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌ను స్థానికులు చితక బాధి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. టూటౌన్ పోలీసుల కథనం మేరకు స్థానిక ఇందిరానగర్‌లోని చైతన్య టెక్నో స్కూలు సమీపంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ సయ్యద్ పక్కింటికి చెందిన ఏడేళ్ల బాలుడికి చాక్లెట్ ఇస్తానని ఇంటిలోకి పిలిపించుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత లైంగిక దాడికి పాల్పడడంతో బాధితుడు గట్టిగా కేకలు వేశాడు. కేకలు విన్న స్థానికులు తలుపులు పగలగొట్టి ఇంటి లోనికి వెళ్లి ఆటో డ్రైవర్‌ను పట్టుకున్నారు.పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆటో డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ సయ్యద్‌పై కేసు నమోదుచేసినట్లు తెలిపారు.


