● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : అంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కౌన్సిలర్లే.. పార్టీని వీడితే రూ.లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారు.. అయినా పార్టీని వీడకుండా చివరి వరకు తమ వెంట నడిచారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక కొవ్వూరు గ్రాండ్‌లో బుధవారం నమ్మకానికి పురస్కారం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పదవీకాలం పూర్తి చేసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవితోపాటు కౌన్సిలర్లందరికి విందును ఏర్పాటు చేసి అనంతరం సన్మానించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్‌పర్సన్ టైలర్ కుటుంబానికి చెందిన సాధారణ చేనేత మహిళ అని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఉన్న తన బావమరిది పాతకోట బంగారు రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం చేతకాని టీడీపీ నేతలు మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంటికి వెళ్లి రూ.40లక్షలు ఆఫర్ చేశారన్నారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతోపాటు తనకు సమాచారం అందించిందని అన్నారు.మున్సిపాలిటీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నించి టీడీపీ నేతలు విఫలమయ్యారన్నారు. ఆరో వార్డుకు చెందిన ఎస్సీ కౌన్సిలర్ జయంతికి డబ్బు ఆఫర్ చేశారన్నారు. ఎంత మందికి ఆఫర్లు ఇచ్చినా పార్టీని వీడకుండా తన వెంట వచ్చారన్నారు. ఒకరిద్దరు టీడీపీలో చేరి పొరపాటైందని చెప్పి వెంటనే తన వద్దకు వచ్చారని అన్నారు. వందేళ్లకుపైగా చరిత్రగల ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఐదేళ్ల పూర్తి పదవీకాలం పూర్తి చేసుకున్న చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి మాత్రమే అన్నారు. ఈ పాలక వర్గ హయాంలోనే సుమారు రూ.150 కోట్లు అభివృద్ధి పనులు మున్సిపాలిటీలో జరిగాయని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరాలి
మరో ఆరు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాచమల్లు ్డ తెలిపారు. మున్సిపాలిటీలో మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేస్తామని భరోసా కల్పించారు. ఇందు కోసం కౌన్సిలర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం అవుతారని, తాను ఎమ్మెల్యేగా ఉంటానని, మంత్రిగా కూడా అవకాశం వస్తుందని తెలిపారు. తమ పార్టీ నేతలను అవమానించిన వారిని దెబ్బకు దెబ్బ కొట్టి వడ్డీతో సహా తీర్చుకుంటామన్నారు. అనంతరం కౌన్సిలర్లను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్లు పాతకోట బంగారుమునిరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, హౌస్ బిల్డింగ్ సొ సైటీ చైర్మన్ ద్వార్శల భాస్కర్‌రెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, రాజుపాళెం జెడ్పీటీసీ అంజనీకుమారి, గోపల్లె సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు పందిటి సరోజమ్మ, ద్వార్శల భారతి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి,రాచమల్లు రమాదేవి, పాతకోట మునిశంశీధర్‌రెడ్డి,కోఆప్షన్ సభ్యులు మల్లికార్జున ప్రసాద్, ఆప్కాబ్ మాజీ చైర్‌పర్సన్ మల్లేల ఝాన్సీరాణి, కోఆపరేటివ్ స్టోర్స్‌అధ్యక్షురాలు గజ్జల కళావతి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు చింతల దానమ్మ తదితరులు పాల్గొన్నారు.


