ఖాజీపేట : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నర్రెడ్డి సునీత కూటమి నేతల చేతిలో కీలుబొమ్మలా మారి వైఎస్ కుటుంబంపై విషం చిమ్ముతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. దుంపలగట్టు గ్రామంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కేసుతో వైఎస్ భారతి, జగన్‌మోహన్‌రెడ్డిలకు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు చెప్పినా, కేవలం ఎన్నికల లబ్ధి కోసమే సునీత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గంటకు కోటి రూపాయలు తీసుకునే లాయర్లకు సునీతకు డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నేరచరిత్ర లేని అవినాష్‌రెడ్డిని కేసులో ఇరికించడం దారుణమని, చివరకు వైఎస్ కుటుంబం కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టిప్పర్ కింద పడి
వ్యక్తి దుర్మరణం
లింగాల : మండల పరిధి బోనాల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం టిప్పర్ కింద పడి దస్తగిరి (40) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలలోకి వెళితే.. బోనాల నుంచి పొలాలకు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో దస్తగిరి తన టిప్పర్‌కు మట్టి లోడు పోయించుకునేందుకు టిప్పర్ నుంచి దిగి మట్టిని లోడు చేయిస్తుండగా.. మరో టిప్పర్ రివర్స్‌లో వచ్చి వెనుక ఉన్న దస్తగిరిపై వెనుక టైర్లు ఎక్కాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దస్తగిరి స్వగ్రామం వేముల మండలం చింతలజూటూరు. ఆయనకు భార్య శోభ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దస్తగిరి మృతదేహాన్ని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఇంత వరకు పోలీసులకు దీనిపై ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
పోరుమామిళ్ల పోస్టాఫీసులో చోరీ
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పోస్టాఫీసులో రెండు లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. ఎస్‌ఐ హనుమంతు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తలుపులు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదు అపహరించారు. మంగళవారం ఉదయం పోస్టాఫీసు సిబ్బంది తలుపులు తెరచి ఉండటం గమనించి లోపల పరిశీలించారు. నగదు చోరీ జరిగినట్లు వారు గమనించి సమాచారం పోలీసులకు తెలిపారు. వెంటనే ఎస్‌ఐ హనుమంతు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పోస్టుమాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మాధవరం దుకాణంలో..
సిద్దవటం : మండల పరిధి మాధవరం 1,2,3 వార్డుల పంచాయతీలోని సుధాకర్ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడి రూ.1.45 లక్షల నగదు అపహరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సుధాకర్ సోమవారం రాత్రి 9 గంటలకు దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం 6 గంటలకు వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించాడు. దుకాణంలో ఉన్న నగదు రూ.25 వేలు, తన భార్య సురేఖ పొదుపు చేసుకున్న నగదు రూ.40 వేలు, బీరువాలో దాచుకున్న రూ.80 వేలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని సుధాకర్ వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ విషయమై ఏఎస్‌ఐ సుబ్బరామచంద్రను వివరణ కోరగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామన్నారు.


