కడప సెవెన్‌రోడ్స్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంలోని మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నగరంలోని నూర్జహాన్ కల్యాణ మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లింగురువులు, పెద్దలు హాజరవుతారన్నారు. ముస్లింలు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా సహకార అధికారిగా పనిచేస్తున్న వెంకటసుబ్బయ్యను జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారిగా నియమించారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు డీపీఓగా పనిచేస్తున్న రాజ్యలక్ష్మి ఉద్యోగ విరమణ చేయడంతో ఆమె స్థానంలో వెంకట సుబ్బయ్య నియమితులయ్యారు. జిల్లాకు కొత్త డీపీఓ వచ్చే వరకు వెంకట సుబ్బయ్య ఇన్‌ఛార్జిగా కొనసాగుతారు.
● కడప ఆర్డీఓగా ఎ.మురళి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా రెవెన్యూ అధికారిగా కె.మల్లికార్జునుడును నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓ ఆర్‌టీ నం. 583ను జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అనంతపురంలోని హంద్రీ–నీవా భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ డీఆర్వోగా పనిచేస్తున్న ఎం.విశ్వేశ్వరనాయుడును విశాఖపట్టణం డీఆర్వోగా బదిలీ చేశారు. నెల్లూరులోని తెలుగుగంగ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ పీఏగా పనిచేస్తున్న ఎ.మురళిని కడప రెవెన్యూ డివిజనల్ అధికారిగా నియమించారు. కడప తెలుగుగంగ ప్రాజెక్టు యూనిట్–2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్.శివరాముడును రాజమహేంద్రవరం ఆర్డీఓగా నియమించారు. కడపలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఎస్.ప్రేమంత్‌కుమార్‌ను ధర్మవరం ఆర్డీఓగా నియమించారు.
కడప కార్పొరేషన్: ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం బుధవారం ప్రత్యేక ’సమస్యల పరిష్కార వేదిక’ను నిర్వహించనున్నట్లు సంస్థ సిఎండి శివశంకర్ లోతేటి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుండి 11:30 గంటల వరకు తిరుపతిలోని ఏపీఎస్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలవారు పారిశ్రామిక విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఎస్‌ఈ కార్యాలయాల్లో మొదటి బుధవారం నిర్వహించిన కార్యక్రమాల్లో పరిష్కారం కాని సమస్యలను, ఈ మూడవ బుధవారం తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో నేరుగా సీఎండీని కలిసి విన్నవించవచ్చని తెలిపారు.
ప్రొద్దుటూరు: పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ’వనజీవి’ దరిపల్లి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన లఘు చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఎంపీటీసీ బూసం రవీంద్రనాథ్ నిర్మించిన ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ లఘు చిత్రంగా ఎంపిక చేస్తూ ‘గద్దర్ అవా ర్డు’ను ప్రకటించింది. చిత్రసీమలో తన తొలి ప్రయత్నంలోనే ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల రవీంద్రనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. వేముగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించారు. కోటిన్నర మొక్కలు నాటి పర్యావరణ ప్రేమికుడిగా గుర్తింపు పొందిన రామయ్య బయోగ్రఫీ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ చిత్రాన్ని నిర్మించినట్లు నిర్మాత తెలిపారు. ఈనెల 19న ఉగాది పండుగ పురస్కరించుకుని తెలంగాణ ప్రభు త్వం నుంచి ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రొద్దుటూరు గడ్డకు గర్వకారణంగా నిలిచిన రవీంద్రనాథ్‌ను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు.


