● నామినేషన్ల పర్వం ప్రారంభం
● ప్యానెళ్ల వారీగా బరిలోకి ప్లీడర్లు
● సీఈవోలు నామినేషన్ల స్వీకరిస్తున్న వైనం
రాజంపేట : జిల్లా న్యాయవాద వర్గాల్లో ఆయా బార్ అసోసియేషన్ ఎన్నికలు రాజుకున్నాయి. సోమవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులకు సంబంధించి బార్ అసోసియేషన్లు తమ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పోటీపడుతున్నారు. బార్ కౌన్సిల్ ఓటరు జాబితాను ఖరారు చేసింది.
జిల్లాలో ఏయే కోర్టు పరిధిలో..
జిల్లాలో కడప, బద్వేలు, జమ్మలమడుగు, నందలూరు, ప్రొద్దుటూరు,పులివెందుల,రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, మైదుకూరు, కమలాపురం,లక్కిరెడ్డిపల్లె కోర్టుల పరిధిలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. న్యాయవాదుల సమాచారం మేరకు జిల్లా వారీగా ఓటర్లు వివరాలు ఇలా ఉన్నాయి. కడప(760), రాజంపేట (155), రైల్వేకోడూరు(35), నందలూరు (24), పులివెందుల (24), కమలాపురం (20), మైదుకూరు (16), జమ్మలమడుగు(30), రాయచోటి (113), ప్రొద్దుటూరు(316), బద్వేలు (69) , ఉన్నాయి. సభ్యుల సంఖ్య ఇటీవల పెరిగి ఉండవచ్చని న్యాయవాద వర్గాలు అంటున్నాయి.
నామినేషన్ల ప్రక్రియ ఇలా..
నామినేషన్ల పర్వం సోమవారం మొదలైన నేపథ్యంలో రాజంపేట కోర్టు వరకు వస్తే ఈనెల 22 వరకు కొనసాగనుంది. 23న పరిశీలన నిర్వహించనున్నారు. 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 25న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈనెల 30న పోలింగ్ ఉంటుంది. ఉదయం 9గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ప్రకియ కొనసాగనుంది. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. ఫలితాలను ఆయా బార్ అసోసియేషన్ల కేటాయించిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటించనున్నారు. ఇదే విషయాన్ని రాజంపేట సీఈవో సురేష్ కుమార్ ధ్రువీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి బార్ అసోసియేషన్ జరుగుతాయని, బార్ కౌన్సిల్ నుంచి నియమనిబంధనల మేరకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.
నామినేషన్ డిపాజిట్ ఇలా..
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ దాఖాలు చేయాలంటే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వివిధ హోదాలకు ఒక్కో రకంగా డిపాజిట్ నిర్ణయించారు. ప్రెసిడెంట్‌కు రూ.3వేలు, వైస్ ప్రెసిడెంట్‌కు రూ.2,500, జనరల్ సెక్రటరీకి రూ.2వేలు, జాయింట్ సెక్రటరీ రూ.1,500, లైబ్రరీ సెక్రటరీకి రూ.1500, ట్రెజరీకి రూ.1500, స్పోర్ట్స్–కల్చరల్ సెక్రటరీకి రూ.1500, మహిళాప్రతినిధికి రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆయా బార్ అసోసియేషన్‌ల నిర్ణయం మేరకు డిపాజిట్స్ ఉంటాయని చెబుతున్నారు. ఈనెలాఖరులోపు బార్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరగకుంటే,అందులోని సభ్యులకు రాష్ట్ర బార్‌కౌన్సిల్ నుంచి వచ్చే లబ్ధి దూరమవుతుందని సీనియర్ న్యాయ వాది కొండూరు శరత్‌కుమార్ రాజు తెలిపారు.
జిల్లాలోని వివిధ కోర్టులో పరిధిలోని సీనియర్ న్యాయవాదులు తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్యానెల్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వివిధ రాజకీయపార్టీ మద్దతుదారులు కూడా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల ఏకగ్రీవాలకు ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు.


