సిద్దవటం : సిద్దవటం మండలంలోని కపర్దీశ్వర స్వామి కోన వద్ద సెప్టెంబర్1, 2014వ తేదీన జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులకు జీవితఖైదు, ఒక్కొక్కరికి రూ.2 వేలు జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి జి.దీనబాబు సోమవారం తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ హారిక తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎ1 పంగా అరుణ వివాహేతర సంబంధం కారణంగా అడ్డుగా ఉన్న భర్త కనపర్తి సిద్దారెడ్డిని చంపాలనే ఉద్దేశంతో మిగిలిన ముగ్గురు ఎ2 షేక్ హుస్సేన్‌బాషా, ఎ3 మారబోయిన బాలకృష్ణ అలియాస్ సురేంద్ర, ఎ4 నస్రుద్దీన్ గౌస్‌పీర్‌లతో కలిసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం భర్తను చంపి అతని దగ్గర ఉన్న బంగారు నగలను తీసుకున్నారు. ఎవరో గుర్తు తెలియని దొంగలు తన భర్తను చంపి బంగారు నగలను దోచుకున్నారని కట్టు కథ అల్లేందుకు ప్రయత్నించిందన్నారు. ఈ కేసులో ఎ1 పంగా అరుణ గతంలో వివాహమై విడాకులు తీసుకున్నట్లు, ఎ2 హుస్సేన్‌బాషాను ప్రేమించిందన్నారు. అతనితో వివాహం చేసేందుకు తన తల్లి అంగీకరించలేదు. బద్వేల్‌కు చెందిన (వికలాంగుడైన) కనపర్తి సిద్దారెడ్డితో వివాహం జరిపించింది. అందుకు ఎ1 పంగా అరుణ తన భర్తను చంపి, బంగారు నగలను తీసుకుని మనం ఎక్కడికై నా వెళ్లి బతుకుదామని ఎ2 హుస్సేన్‌బాషాకు చెప్పింది. అందుకు ఎ2 హుస్సేన్‌బాషా తన స్నేహితులైన మారబోయిన బాలకృష్ణ, గౌస్‌పీర్‌లతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ముగ్గురు సిద్దవటం మండల కపర్తీశ్వరస్వామి కోన వద్ద వేచి ఉన్నారు. ఎ1 పంగా అరుణ తన భర్తని మోసగించి అక్కడికి తీసుకురాగా నిందితుల అందరూ కలిసి అతని దగ్గర ఉన్న బంగారు నగలను దోచుకొని రాళ్లతో కొట్టి మృతుడి బెల్టు తీసి మెడకు బిగించి, అక్కడ పడవేసి వెళ్లిపోయారని ఎస్‌ఐ తెలిపారు. ఎ1 పంగా అరుణ తన అమ్మ, మేనమామల సహాయంతో అత్తవారింటికి వెళ్లి తన భర్తను ఎవరో గుర్తు తెలియని దొంగలు చంపి బంగారం నగలను దోచుకొని వెళ్లినట్లు చెప్పిందన్నారు. వారు అనుమానంతో దబాయించగా తన భర్తను కొట్టి పడేసిన చోటుకు తీసుకెళ్లగా కొన ఊపిరితో ఉన్న మృతుడు కనపర్తి సిద్దారెడ్డిని కడప రిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చైన్నె విజయ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ 15 రోజుల తర్వాత మృతిచెందినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. మృతుడి తండ్రి కనపర్తి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ అధికారి అప్పటి ఒంటిమిట్ట సీఐ టి.రెడ్డప్ప విచారణ చేసి, రెండు రోజుల్లో కేసును ఛేదించి సెప్టెంబర్3, 2014 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి దోచుకున్న బంగారు నగలను సీజ్ చేసి జ్యుడీషియల్‌రిమాండ్‌కు తరలించారన్నారు. కేసును విచారించి కోర్టులో చార్జిషీటు ఫైల్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసును ఎస్సీ, ఎస్టీ, 4 ఏడీజే కడప కోర్టు న్యాయమూర్తి విచారణ చేసి సాక్షులను విచారించి నిందితులు ఎ1, ఎ2, ఎ3, ఎ4 నేరం చేసినట్ల నిరూపణ కావడంతో న్యాయమూర్తి జి.దీనబాబు వీరికి జీవితఖైదు, ఒక్కొక్కరికి రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున సమర్థవంతంగా వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ ఎల్.బాలాజీని అప్పటి ఒంటిమిట్ట సీఐ టి.రెడ్డప్పను, ప్రస్తుత రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ప్రస్తుత ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, సిద్దవటం ఎస్‌ఐ హారిక, కోర్టు కానిస్టేబుల్ సి.మల్లిఖార్జునరావును కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


